మహాయుతి కూటమి నాయకుడిగా ఎంపికైన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడంతో పది రోజుల అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. కీలకమైన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడిపోయింది. నవంబర్ 23న ప్రకటించిన ఫలితాల్లో మహాయుతికి ఊహించనంత భారీ మెజార్టీ-288లో 230 సీట్లు లభించినా- ముఖ్యమంత్రి ఎవరన్నది పీటముడి పడటంతో ఆ కూటమికి ఘన విజయం పొందిన సంతోషం ఆవిరైనంత పనయ్యింది. అనిశ్చితి, గందరగోళంతోపాటు ముంబయి రాజకీయాల్ని పరిష్కరించడానికి ఢిల్లీ వంక చూడాల్సిన దుస్థితి మహాయుతి నేతలకు దాపురించింది. పదవుల పంపకాల్లో పేచీ బీజేపీ అధిష్టానానికి కూడా తల బొప్పికట్టిందని కథనాలు వెలువడ్డాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న ఏక్‌నాథ్ షిండే ఆ పీఠాన్ని వదలబోనని మొరాయించడం ఒకవైపు, అత్యధిక స్థానాలు పొందిన బీజేపీకే ముఖ్యమంత్రి పదవి అంటూ కమలనాథులు పట్టుబట్టడం ఓ ప్రహసనంగా మారింది. తామేమీ తక్కువ కాదంటూ ఎన్‌సిపి నేత అజిత్ పవార్ తన వాటా కోసం ఉభయ పక్షాలతోనూ బేరసారాలు సాగించారని వార్తలొచ్చాయి. మొత్తంగా మహాయుతి కూటమిలోని నేతలు పైకి నవ్వుతూ స్టేట్‌మెంట్లు ఇచ్చినా.. లోనమాత్రం కుతకుత లాడిపోయారు.
ఒక దశలో సీఎం కాకుండా డిప్యూటీ ఇస్తే తమకే హోంశాఖను ఇవ్వాలని శివసేన పట్టుబట్టింది. మరోవైపు షిండే తనయుడ్ని డిప్యూటీ అని తెరమీదకు తెచ్చాక ఆ ప్రతిపాదనకు సానుకూలత రాకపోవడంతో తూచ్.. అన్నారనీ మీడియా కథనాలు వచ్చాయి. ఇలాంటి తతంగాలన్నీ నడిచాక ఏక్‌నాథ్ షిండేతో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. బుధవారంనాడు తొలుత బీజేపీ శాసనసభాపక్షం, ఆ తరువాత మహాయుతి శాసనసభ్యుల సమావేశం.. ఇలా కథ ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు ఐదోతేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరిగినా గాని తర్వాత మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుల్లో ఎన్ని పేచీలు వస్తాయో, ఏ విధంగా తలెత్తి ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. మహాయుతి కూటమికి సంఖ్యా బలం భారీగా వున్నప్పటికీ పదవుల పంపకాల్లో విభేదాలవల్ల అది బలహీనంగానే కొనసాగుతుందని ప్రాథమిక పరిణామాలు విదితం చేస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పబడే ముంబయి నగరం, ఆ రాష్ట్రంలో ఇటువంటి అనిశ్చిత పరిస్థితి శ్రేయస్కరం కాదు.
శివసేన పార్టీ నేడున్న పరిస్థితి చూసి పలువురు జాలి పడుతున్నారు. ఎన్నికల్లో 57 స్థానాల్లో గెలుపొందినా ఆ ఎమ్మెల్యేలను కమలనాథులు ఆ పార్టీలో కొనసాగనిస్తారా అన్నది అనేకమంది సందేహం. బీహార్‌లో జెడియుని ముక్కలు చేయడం, రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీలో చాలామందిని మింగేయడం పలువురికి గుర్తుండే వుంటుంది. స్నేహం చేసిన పార్టీలను నిర్వీర్యం చేయడమూ బీజేపీ మరో ఎత్తుగడ. ఆ విధంగానే అకాలీదళ్ క్రమంగా బలహీనపడింది. హర్యానాలో చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలను కొందరికి పదవులిచ్చి, ఇంకొందరిని బెదిరించీ తమ పార్టీలోకి లాక్కున్న బీజేపీ చరిత్ర జగమెరిగిందే! బీజేపీ ఏ పార్టీతో చెలిమి చేసినా దాని పని అయిపోయినట్టే! ఆ విషయం జెడియు, అకాలీదళ్, ఇప్పుడు శివసేన (షిండే గ్రూపు)ను చూస్తే తేటతెల్లమవుతుంది. అలాగే దాంతో పరోక్ష స్నేహం చేసిన పార్టీలు కూడా వైసీపీ, బీఆర్‌ఎస్, బీజేడీ మాదిరిగా శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం. అది ముమ్మాటికీ ఓ సుడిగుండం. చిక్కితే అంతే సంగతులు!
తెలుగురాష్ట్రాల్లో కూడా షిండేలున్నారని, భవిష్యత్తులో ఇక్కడా అలాంటి పరిణామాలు పునరావృతమవుతాయనీ ఇంతకుమునుపు ఊహాగానాలు వినిపించాయి. అలాంటివి భవిష్యత్తులో జరిగినా ఆశ్చర్యపడనక్కరలేదు. అధికారం, పదవీ వ్యామోహం వారిని ఆ విధంగా లాక్కుపోతాయి. అయితే షిండేలుగా అవుతారనుకున్న వారు మాత్రం మహారాష్ట్ర షిండే అనుభవాన్ని గుర్తెరగడం ఎంతో అవసరం. అలాగే చెలిమి చేసిన, చేస్తున్నవారూ యోచించడమూ అంతే అవసరం. అది ధృతరాష్ట్ర కౌగిలి సుమా! తస్మాత్ జాగ్రత్త!!