బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌..

Big shock for BRS..– హస్తం గూటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ శరత్‌ చంద్రా రెడ్డి
– కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
– బయ్యారంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధుల రాజీనామా..
– పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
నవతెలంగాణ – ఘట్‌కేసర్‌/బోడుప్పల్‌/బయ్యారం
జన బలంతో ముందుకు వస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. నోట్ల కట్టలతో వచ్చే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. బుధవారం మేడ్చల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ మలిపెద్ది శరత్‌ చంద్ర రెడ్డి.. బీఆర్‌ఎస్‌ పార్టీకీ రాజీనామా చేసి వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రతాప సింగారంలోని మలిపెద్ది సుధీర్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. సుధీర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ,, సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎమ్మెల్యేగా మేడ్చల్‌ నియోజకవర్గాన్ని సుధీర్‌ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మేడ్చల్‌ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. టికెట్‌ రాని వారు తనను తిట్టినా కుటుంబ పెద్దగా వాళ్ల బాధను అర్థం చేసుకుంటున్నానని.. వారికి భవిష్యత్‌లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మలిపెద్ది సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములను ఇష్టానుసారంగా కబ్జా చేసి ప్రజల సొమ్మును దోచుకున్న మంత్రి మల్లారెడ్డి నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడమే మనందరి ఏకైక లక్ష్యమని స్పష్టంచేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ నుంచి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ (జంగయ్య యాదవ్‌) గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, రేవంత్‌రెడ్డి వచ్చే ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సుధీర్‌రెడ్డి ఇంటి ముందు సందడి నెలకొంది. అయితే ఎన్నికల అధికారులు ఎంపీడీఓ అరుణ, ఇతర అధికారులు ర్యాలీలకు, సమావేశాలకు అనుమతి లేదని సుధీర్‌ రెడ్డిని ఇంట్లోకి వెళ్ళి ప్రశ్నించగా తన ఇంట్లోకి వచ్చి ఇలా అడగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేడ్చల్‌, ఉప్పల్‌ నియోజక వర్గాల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బయ్యారంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధుల రాజీనామా..
మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇస్తూ.. మండలానికి చెందిన 9 మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆరుగురు ఉప సర్పంచులు, ఐదుగురు సొసైటీ డైరెక్టర్లు, పలువురు వార్డు మెంబర్లు, పార్టీ ముఖ్య నాయకులు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో-చైర్మెన్‌, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్‌ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కోరం కనకయ్య.. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఓవైపున బీఆర్‌ఎస్‌ అసంతృప్తుల నిరసన జరుగుతున్నా.. ఎమ్మెల్యే దంపతులు తమ వైఖరి మార్చుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. మండలంలో ఎమ్మెల్యే దంపతులు పర్యటించి దళితబంధు, గృహలక్ష్మి, డబుల్‌ బెడ్‌రూమ్‌ లాంటి పథకాలు వారం, పది రోజుల్లో మంజూరు చేస్తామని మాయ మాటలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కోసం గిరిజన, ఆదివాసీ, దళితులతో పాటు సామాన్య ప్రజలను సైతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పడిగాపులు కాసినా రాని పథకాలు ఎన్నికల కోడ్‌ అమలులో ఏ విధంగా మంజూరు చేస్తారో పాత్రికేయుల సమక్షంలో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
నేడు కాంగ్రెస్‌లో చేరనున్న రేవూరి
– పరకాల నుంచి బరిలోకి..
– ఇప్పటికే టికెట్‌ ఆశిస్తున్న కొండా మురళి, ఇనుగాల వెంకట్‌రెడ్డి
– రసకందాయలో వరంగల్‌ రాజకీయాలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. సీనియర్‌ నేతలు పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారింది. జనగామ నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి భూపాలపల్లిలో నేడు (గురువారం) రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ‘రేవూరి’తో మంతనాలు జరిపి కాంగ్రెస్‌లో చేరేలా ఆయన్ను ఒప్పించి నర్సంపేటకు బదులుగా పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దించడానికి కసరత్తు చేశారు. ఇక ‘రేవూరి’ అభ్యర్థిత్వం ఖరారు లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతోపాటు ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలున్నాయి. ఈ క్రమంలో ‘రేవూరి’ని కాంగ్రెస్‌లో చేర్చుకొని పరకాల బరిలోకి దించడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి చెక్‌పెట్టేలా రంగం సిద్ధం చేశారు. దాంతో ఉమ్మడి వరంగల్‌ రాజకీయాలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నడుమ రసకందాయంలో పడ్డాయి.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి గురువారం భూపాలపల్లిలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ‘రేవూరి’ గతంలో నర్సంపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తొలిసారి ఎంసీపీఐ నేత ఎం. ఓంకార్‌పై విజయం సాధించిన ‘రేవూరి’ టీడీపీలో కీలక నేతగా మారారు. జీవో 610 సబ్‌ కమిటీకి చైర్మెన్‌గానూ వ్యవహరించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, రేవూరి టీడీపీలో పనిచేసిన వారే కాకుండా మాజీ మంత్రి తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ‘రేవూరి’ని కాంగ్రెస్‌లో చేరేలా ఒప్పించారు. అంతేకాదు, ఏకంగా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ‘రేవూరి’కి పార్టీ హామీనిచ్చినట్టు సమాచారం. పరకాలలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఒకవైపు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పట్టుబడుతుండగా, మరోవైపు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా మురళీ సతీమణి మాజీ మంత్రి కొండా సురేఖకు పార్టీ టికెట్‌ ఇవ్వనున్నారు. కాగా, పరకాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఎదుర్కొనడానికి ‘ఇనుగాల’ సామర్ధ్యం సరిపోదన్న భావనలో పార్టీలో చర్చ జరుగుతున్న క్రమంలో ‘రేవూరి’ కాంగ్రెస్‌లో చేరడంతో పరకాలలో అభ్యర్థి సమస్య పరిష్కారమైనట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘రేవూరి’ స్వగ్రామం దుగ్గొండి మండలంలోని కేశవాపూర్‌. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సరిహద్దులోనే ఈ గ్రామం ఉంటుంది. ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో ‘రేవూరి’ బంధువర్గముంది. అంతేకాకుండా గతంలో టీడీపీలో పనిచేసిన నేతలతో ‘రేవూరి’కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది ‘రేవూరి’కి లాభిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.