బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

– జడ్పీ చైర్మన్‌ ప్రధాన అనుచరుడు ‘కరివేద’ కాంగ్రెస్‌ లో చేరిక
– కాంగ్రెస్‌లో చేరికకు క్యూ కడుతున్న బిఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ – బోనకల్‌
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు ప్రధాన అనుచరుడు బోనకల్‌ మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు సొసైటీ ఉపాధ్యక్షుడు కరివేద సుధాకర్‌ సోమవారం కాంగ్రెస్‌లో చేరాడు. మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో కరివేద సుధాకర్‌కు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదే విధంగా కలకోట బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు, ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ పెద్దపోలు కోటేశ్వరరావు కలకోట గ్రామంలో బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు. నాగేశ్వరరావుకి భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బోనకల్లు మండలంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజుకు అన్ని తానై ప్రముఖ కాంట్రాక్టర్‌ కరివేద సుధాకర్‌ ఒక వెలుగు వెలిగాడు. మధిర మండలంతో పాటు బోనకల్లు మండలంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని విజయవంతం చేయటంలో కీలక పాత్ర నిర్వహించాడు. బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మధిర నియోజకవర్గ వ్యాప్తంగా కరివేద సుధాకర్‌ కాంట్రాక్టు పనులు నిర్వహించాడు. దీంతో పెద్ద ఎత్తున బిల్లులు కూడా పేరుకుపోయాయి. మరి కొద్ది రోజులలో కమల్‌ రాజు అధికారం కూడా ముగియనుండటంతో అధికార బలం కోసం కరివేద సుధాకర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. బోనకల్‌ మండల వ్యాప్తంగా అనేకమంది బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరటానికి ప్రతిరోజు తహతహలాడుతున్నారు. దీంతో ఆయా గ్రామాలలో కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే కొంతమంది నాయకుల చేరికను వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా లింగాల కమల్‌ రాజుకు ప్రధాన అనుచరుడిగా ఉంటున్న మరో కాంట్రాక్టర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు కూడా త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు పెద్ద ఎత్తున బోనకల్లులో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నాయకుడి చేరికను ఆ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కమల్‌ రాజ్‌ అండతో అధికార అహంకారంతో తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని, అందువల్లనే తాము ఆ నాయకుడి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బోనకల్లు మండల వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ నాయకులు పది సంవత్సరాల పరిపాలన కాలంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అటువంటి వారిని కాంగ్రెస్‌ లోకి రానిచ్చే ప్రసక్తే లేదని ఆయా గ్రామాల కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం బోనకల్లు మండలంలో అన్ని గ్రామాలలో బీఆర్‌ఎస్‌ దాదాపు 80 శాతం వరకు ఖాళీ అయ్యే రాజకీయ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చేరికల కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్‌ కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, జడ్పిటిసి మోదుగు సుధీర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి మధిర మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌
– మల్లాది వాసు దంపతులతో పాటు పలువురు కౌన్సిలర్లు చేరిక
నవతెలంగాణ-బోనకల్‌
మధిర బిఆర్‌ఎస్‌కు కోలుకోలేని భారీ షాక్‌ సోమవారం తగిలింది. మధిర మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ భరత్‌ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి విద్యాలత దంపతులు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో సోమవారం బోనకల్‌ మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు ప్రధాన అనుచరుడు మధిర మున్సిపల్‌ కౌన్సిలర్ల మల్లాది వాసు, సవిత దంపతులకు కూడా మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. అదే విధంగా పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు గద్దల మాధురి, నాని దంపతులు, మేడికొండ కిరణ్‌, కళ్యాణి దంపతులు, కౌన్సిలర్‌ ధీరావత్‌ మాధవిలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ కండువాలు కప్పారు. వీరితో పాటు బీఆర్‌ఎస్‌ మధిర పట్టణ ఉపాధ్యక్షులు గూడేల్లి నాగరాజు, మిషన్‌ భగీరథ తెలంగాణ కార్మిక సంఘం నాయకులు గద్దల రాజా తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరటంతో దాదాపు మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్‌ వశం కానున్నది. అదే విధంగా బిఆర్‌ఎస్‌ మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజుకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు
కారేపల్లి: కారేపల్లి, మాధారం గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఖమ్మంలోని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో టీడీపీ నాయకులు కొల్లి వీరయ్య, కాసాని లక్ష్మినారాయణ, ఎస్‌కె.బందేలీ, గణపారపు శ్రీను, బానోత్‌ శ్యామ్‌లాల్‌, బట్టు నర్సయ్య, కారేపల్లికి చెందిన బీఎస్‌పీ జిల్లా నాయకులు ఆదెర్ల రాములు ఉన్నారు.
మండల కమిటీ అనుమతితోనే చేరికలు : ఎమ్మెల్యే
కాంగ్రెస్‌ పార్టీలో చేరదలుచుకున్న వివిధ పార్టీల కార్యకర్తలు ఆయా మండల పార్టీ అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ కోరారు. మండల పార్టీ తెలియకుండా పార్టీలో చేర్చుకునేది లేదన్నారు.