
– కోర్టు తీర్పుతో నాయకుల ఆందోళన
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : బిఆర్ఎస్ పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని కట్టింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నిస్తూ ఉండగా.. నల్లగొండ బిఆర్ఎస్ నేతలు మాత్రం అనుమాతుల కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అయినా మునిసిపల్ అధికారులు అనుమతులు ఇవ్వలేదని అవసరమైతే ఎల్ ఆర్ ఎస్ ప్రకారం ఎంతైనా బిల్లును కట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు. అనుమతులు లేని భవనాన్ని కూల్చివేయమని ప్రజాదర్బార్ లో వందల మంది సమక్షంలో మంత్రి కోమటిరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులలో బిఆర్ఎస్ భవనాన్ని కాపాడుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు.. భవనాన్ని నిర్మించే అప్పుడు అనుమతులు తీసుకోవాలి. కానీ నిర్మించాక ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఇది సమంజసం కాదని తీర్పును వెల్లడిస్తూ 15 రోజులలోగా బిల్డింగును కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశిస్తూ బిఆర్ఎస్ నాయకులు లక్ష రూపాయలు కూడా కట్టాలని తీర్పులో ఆదేశించింది.
కూల్చివేతకు రంగం సిద్ధం…
బిఆర్ఎస్ బిల్డింగును నేలమట్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆత్మ రక్షణ కోసం బిఆర్ఎస్ నేతలు హై కోర్ట్ ను ఆశ్రయించి బోల్తా పడ్డారు. కోర్టు తీర్పు వారికి వ్యతిరేకంగా రావడంతో బిఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోగా అధికార కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేలమట్టం చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితులలో బిఆర్ఎస్ నేతలు హై కోర్ట్ ఆర్డర్ తీసుకొని సుప్రీంకోర్టుకు ఆశ్రయించే లోపే ఈ భవనాన్ని కూల్చి వేస్తున్నట్లు విస్తృతమైన ప్రచారం జరుగుతుంది.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం…
కంచర్ల భూపాల్ రెడ్డి
జిల్లా కేంద్రంలో నిర్మించిన ఏ పార్టీ కార్యాలయాలకు కూడా అనుమతులు లేవని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.రాజకీయ కక్షతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమ పిటీషన్ ను కోర్టు సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, న్యాయం కోసం మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు.