నవీపేట్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

నవతెలంగాణ – నవీపేట్: నవీపేట్ మండల బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ బర్త్డే రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో నవీపేట్ బీఆర్ఎస్ పార్టీకి శనివారం బిగ్ షాక్ తగిలింది. నవీపేట్ జెడ్పిటిసి సబితా బుచ్చన్న, నవీపేట్- 2 ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్, లింగాపూర్ ఎంపీటీసీ సాధన రాజేశ్వర్, లింగాపూర్ తాజా మాజీ సర్పంచ్ బత్తూరు సాయిలు, గాంధీనగర్ తాజా మాజీ సర్పంచ్ ఆదిలక్ష్మి రామచందర్, కోస్లి మాజీ సర్పంచ్ ముత్యన్న, మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ గౌడ్ తదితరులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు నవీపేట్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. మరికొంతమంది బిఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి బిఆర్ఎస్ నాయకులను చేర్చుకుంటూ రోజురోజుకు బిఆర్ఎస్ పార్టీని బలహీనపరుస్తూ ఎంపీ ఎన్నికలలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకపోవడంతో భవిష్యత్తులో మరింత బలహీన పడనున్నట్లు తెలుస్తోంది.