బిల్లు గొప్పదే…

Bill is great...– కేంద్రానికే అమలుచేసే ఉద్దేశం లేదు
– ఆ రెండు క్లాజులు తొలగించాలి..
– తక్షణమే అమలు చేయాలి..
– భారత మహిళల్ని అవమానించొద్దు : రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్‌ బిల్లు గొప్పదేనని, అయితే ఇప్పుడు రిజర్వేషన్లను అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. కులగణన వంటి డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఉభయసభల ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ గతంలో చేసిన జనాభా గణాంకాల వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని, ఓబీసీలు, ఇతర బలహీన వర్గాల జనాభాను నిర్ధారించేందుకు తాజా కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని, అయితే ఏ తేదీ నాటికి అమలు చేస్తారనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన వంటివి జరగాలంటూ రెండు క్లాజ్‌లు ఉన్నాయని చెప్పారు. ఈ రెండింటికీ ఏండ్లు పడుతుందన్నారు. ఈ రెండు క్లాజ్‌లను (జనగణన, డీలిమిటేషన్‌) తొలగించి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని, భారతదేశ మహిళల తెలివితేటలను అవమానించవద్దని సూచించారు. ”ఈరోజు నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇదేమంత కష్టమైన పని కాదు. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. ఇది కేవలం సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడ” అని రాహుల్‌ ఆరోపించారు. ఓసీసీ జనగణన గురించి, భారత ప్రభుత్వంలో ఓసీలకు తగినంత ప్రాధాన్యం లేకపోవడాన్ని పార్లమెంటులో తాను లేవనెత్తానని అన్నారు. 90 మంది సెక్రటరీల్లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారని అన్నారు. ప్రధాని ప్రతిరోజూ ఓబీసీల గురించి మాట్లాడతారని, కానీ వారికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.