ముందుంది ముసళ్ళ పండగ : బిల్లా

– ఎర్రబెల్లి అవినీతి బండారం బయటపెడతా..
నవతెలంగాణ – రాయపర్తి
బీఆర్ఎస్ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన నన్ను అవమానాలకు గురి చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ముందుంది ముసళ్ళ పండగ అని బిల్లా సుధీర్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే బిల్లా కుటుంబం అనేది జగమెరిగిన సత్యం అన్నారు. స్వర్గీయ బిల్లా సంజీవరెడ్డి 40 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు అతని వారసుడిగా నేను గత 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా అని తెలిపారు. నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యవర్తులతో మభ్యపెట్టి ముసలి కన్నీరు కార్చినట్లుగా వ్యవహరిస్తే నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరాను అని చెప్పారు. తదుపరి ప్రతి ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసమే అహర్నిశలు కృషి చేశా అన్నారు. వర్తమాన కాలంలో గులాం గిరి నాయకుల మాటలు విని నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. గత మూడు రోజుల క్రితమే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకే చెప్పడం జరిగింది. రెండు రోజులు గడిచిన తర్వాత నన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టడం విడ్డూరంగా ఉంది అని దుయ్యబట్టారు. గతంలో ఎర్రబెల్లి విజయం కోసం జంగ రాఘవరెడ్డినే ఎదిరించ ఇప్పుడు నమ్మించి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, అవినీతికి పర్యాయపదమైన ఎర్రబెల్లి దయాకర్ రావు బాగోతం జనాల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. బిల్లాతో పాటు 35 సంవత్సరాలుగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయాల కోసం పాటుపడిన రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, 2021 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారుడు ఇల్లంద మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండీ నాయిమ్, మండల నాయకుడు పోగులకొండ వేణు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.