బిలియనీర్లకే ప్రయోజనం

బిలియనీర్లకే ప్రయోజనం– బీజేపీ, బీజేడీ కలిసే ఖనిజ సంపద లూటీ : రాహుల్‌గాంధీ
భువనేశ్వర్‌ : ఒడిశాలో విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీ, బీజేడీ కలిసే ఉన్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. కేంద్రపాడ లోక్‌సభ నియోజకవర్గంలోని సాలిపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మోడీ, నవీన్‌ పట్నాయక్‌ చేతులు కలిపి కొంతమంది బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని అదానీకి అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ భారీ కుంభకోణాలకు పాల్పడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులు ప్రజల ఆస్తులేనని, రూ.9 లక్షల కోట్ల ఖనిజ సంపదను దోచుకున్నారని విమర్శించారు. రూ.20 వేల కోట్ల మేర భూములు లాక్కున్నారని, రూ.15 వేల కోట్ల ప్లాంటేషన్‌ కుంభకోణం జరిగిందని చెప్పారు. పేదలు, రైతుల కోసం పనిచేసే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.