బిలియన్ల విలువగల సరుకు రవాణా ఎర్ర సముద్రంలోకి రాకుండా దారి మళ్లింపు

Freight worth billions A diversion from entering the Red Seaయెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల దాడులను ఎదుర్కొంటున్న ఎర్ర సముద్రం, సుయెజ్‌ కాలువ గుండా సాగే సరుకు రవాణా మార్గం నుంచి మరో మార్గానికి మారింది. ఇలా మారిన సరుకుల విలువ 35 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం 57 కంటైనర్‌ నౌకలు ఆఫ్రికా దక్షిణాగ్రాన్ని చుట్టి పయనిస్తున్నాయి. మున్ముందు ఈ నౌకల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ సీ లాజిస్టిక్స్‌ గ్లోబల్‌ హెడ్‌గా వున్న పావోలో మాంట్రోన్‌ సిఎన్‌ బిసికి చెప్పాడు. ఇలా ఆఫ్రికా దక్షిణాగ్రాన్ని చుట్టి పయనించే నౌకలలో 7లక్షల కంటైనర్లు ఉన్నాయి. వీటి విలువ 35బిల్లియన్‌ డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. గత సోమవారం రెండుకుపైగా నౌకలపై దాడి జరిగిందనే రిపోర్టుల నడుమ నౌకలను ఎర్ర సముద్రం, సూయజ్‌ కాలువల గుండా రాకుండా దారి మల్లించారు. గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మానవ హననానికి వ్యతిరేకంగా తాము ఇజ్రాయిల్‌ వెళ్ళే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు హౌతీ నాయకులు చెబుతున్నారు. ఎర్ర సముద్రం గుండా తన చమురు రవాణాను నిలిపివేస్తున్నట్టు బ్రిటిష్‌ చమురు కంపెనీ బిపి ప్రకటించింది. అనేక ప్రధాన సరుకు రవాణా కంపెనీలు ఎర్ర సముద్రం గుండా సరుకు రవాణాను నిలిపివేశాయి. బాబ్‌ ఎల్‌ మండేవ్‌ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ప్‌ ఆఫ్‌ యేడెన్‌తో కలుపుతుంది. ఆ తరువాత ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు మధ్యదరా సముద్రాలను సుయెజ్‌ కాలువ కలుపుతుంది. ఈ సముద్ర మార్గం ఆసియా, ఐరోపా ఖండాలను కలుపుతుంది. ఈ మార్గం గుండా 12శాతం ప్రపంచ వాణిజ్యం, 30 శాతం కంటైనర్ల రవాణా జరుగుతుంది.