– అప్పుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు
– 5 నెలలుగా బిల్లులు పెండింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు మాడుతోంది. అప్పులు చేసి విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నా.. ప్రభుత్వాలు వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బిల్లులు రాక.. మరోవైపు వేతనాలు అందక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. కార్మికులకు చెల్లించాల్సిన రూ.వెయ్యి గౌరవ వేతనం కూడా పెండింగ్‌లోనే ఉంది. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. ‘రేపు, మాపు’ అంటూ కాలం వెళ్లదీస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనంతోపాటు పెండింగ్ బిల్లులనూ చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.
పెరుగుతున్న ఆర్థిక భారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 450కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 350కు పైగా పాఠశాలల్లో దాదాపు 2వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రస్తుతం మూడు నెలలు, అంతకు ముందు రెండు నెలలు కలిపి మొత్తం 5 నెలల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఒక్క నెల మాత్రమే కోడిగుడ్డు బిల్లు విడుదల చేసింది. ఇలా దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.60 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు ఓ వైపు మార్కెట్‌లో ధరలు భగ్గుమంటుంటే ప్రభుత్వం మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచడం లేదు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ వంట కార్మి కులతో ఆర్థిక భారంతోపాటు పనిభారం కూడా పెంచుతు న్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి రాగి జావ కూడా విద్యా ర్థులకు ఇవ్వాలని నిర్ణ యించిన ప్రభుత్వం మధ్యా హ్న భోజన కార్మికులకు ఎలాంటి హెల్పర్లను ఇవ్వ కుండానే ఆ పని కూడా మీరే చేయా లంటూ ఆదేశించింది.
అప్పులు చెల్లించలేక ఇబ్బందులు
స్కూల్ పిల్లలు పస్తులుం డొద్దని మేడ్చల్‌కు చెందిన ఓ మధ్యాహ్న భోజన కార్మికురాలు అప్పు చేసి మరీ మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టింది. సర్కార్ బిల్లులు ఇవ్వక ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా అమె అప్పు కుప్పయి కూర్చుంది. అప్పు అక్షరాలా రూ.35 వేలకు చేరుకున్నది. అది తీర్చేం దుకు బంగారం కుదువపెట్టి, చుట్టాలను కాళ్ల వేళ్లా పడి చేబదులు తెచ్చి ఇటు.. అటు చెల్లించే క్రమంలో భార్య భర్తల మధ్య గొడవకు దారి తీసింది. ఇలాంటి సమస్యలే జిల్లాలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరినీ వెంటా డుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులపై పడుతోంది. మధ్యాహ్న భోజన కార్మికులు తమ స్థాయికి మించి అప్పులు చేసి వంట చేసి పెడుతున్నా, సర్కార్ మాత్రం బిల్లుల చెల్లింపులో జాప్యం వహిస్తోంది. ఫలితంగా వంటలు చేద్దామన్నా, అప్పు పుట్టక, సర్కార్ నుంచి బిల్లులు రాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
అప్పు చేసి పెట్టుబడి పెడితే, సర్కార్ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరం. దాదాపు 5 నెలలుగా బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు, పెంచిన గౌరవ వేతనం చెల్లించేలా చూడాలి.
మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఉన్ని కృష్ణ
అమలు కాని రూ.3వేల వేతనం
మధ్యాహ్న భోజన కార్మికులు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. అరకొర వసతులతో అష్టకష్టాలు పడుతూ వండి పెడుతున్నా, తమకు కనీస వేతనంతోపాటు పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని గతంలో 45 రోజులు సమ్మె, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో వేతన పెంపు జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయినా నేటికీ వేతనాలు మాత్రం పెరగడం లేదు.