సూ(పా)త్రధారి..బీరెన్‌!

Sampadakiyamఐదు వందల మంది ఉన్న పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైనవారు కూడా ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటారు. అలాంటిది, సుమారు అటుఇటుగా అరకోటి జనాభా నివసిస్తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి? బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ వ్యవహార శైలి అలా లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై విద్వేషాగ్నితో ఆ రాజ్యాన్నే బలి చేసే ప్రయత్నం చేస్తే అంతకుమించిన అమానవీయత ఉండదు. రెండు తెగల మధ్య సృష్టించిన వైరాన్ని సున్నితంగా పరిష్కరించాల్సిందిపోయి నిస్సిగ్గుగా అగ్గికి ఆజ్యం పోస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరవైనెల్లకుపైగా జరుగుతున్న అల్లర్లకు, హత్యలకు, విధ్వంసాలకు కారణం, ఇప్పటివరకు ‘కుకీ తీవ్రవాదులు- భద్రతా దళాల’ ఘర్షణగా చిత్రీకరించారు. కానీ, ఇందులో బీజేపీ డబులింజన్‌ సర్కార్‌ హస్తముందని వామపక్ష మీడియా, నిజనిర్ధారణ కమిటీలు, పలు సంఘాలు, బాధితులు మొత్తుకున్నా రాష్ట్రపతి సైతం స్పందించలేదు. చివరకు ఐక్యరాజ్యసమతి, అంతర్జాతీయ న్యాయ స్థానం ఈ మరణ మృదంగానికి బీజేపీయే కారణమని తేల్చినా ‘బీరెన్‌ తప్పేమీలేదని’ మోడీ, అమిత్‌షాలు సీఎంను వెనుకేసుకొచ్చారు. ఆ మంటలకు ఆజ్యం పోసింది, ఆరని చిచ్చును రగిలించింది, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రేనని రుజువుచేసే ఆడియోటేపు ఇప్పుడు వైరలవుతున్నది. ఇంతకాలం దుష్ప్రచారంతో ప్రజల్ని పక్కదారి పట్టించిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి దీనికేం సమాధానం చెబుతారు?
250కి పైగా మృతులు, 865 కాల్పులు, వందలాది బాంబులు, 320 చర్చీలు, వేలాది ఇండ్లపై దాడులు. ఇంకా ఊచకోతలు, కిడ్నాపులు, అఘాయిత్యాలు. ఆపైన హాహాకారాలు, ఆర్తనాదాలు, డెబ్బయి వేలమంది శరణార్థుల ఆకలికేకలు, ఇవి మణిపూర్‌ మారణహోమపు అగ్నికీలలు. కుకీ మహిళల్ని వివస్త్రలు చేసి ఊరేగించిన దుశ్చర్య దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. వీటన్నింటికీ సూత్రధారి బీరెన్‌సింగ్‌యేనని తేలింది. ఆయన ఆడియో టేపుల సంభాషణ బయటపడటంతో వీటిని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు మణిపూర్‌ హింసాకాండపై విచారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమించిన జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఆ ఆడియో టేపుల్ని అందజేసింది. దాని ప్రామా ణికతను పరీక్షించాలని న్యాయస్థానం ఆదేశించడంతో దేశంలోనే పేరెన్నిక గల ట్రూత్‌ ల్యాబ్‌కు పరిశీలన నిమిత్తం పంపించింది. టేపుల్లో ఉన్న వాయిస్‌ బీరెన్‌సింగ్‌ స్వర నమూనాతో సరిపోయినట్టు ఇటీవల ట్రూత్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. ఈకేసుపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ ల్యాబ్‌ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ వెరిఫికేషన్‌కు పంపి మూడు వారాల్లో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.
ఇంతకీ ఆడియోటేపులో ఏముంది? ‘మైతీలను తుపాకులు దోచుకోనివ్వండి, వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో లూటీలు చేసేందుకు అవకాశమివ్వండి’ అంటూ అధికారులను ఆదేశించిన సంభాషణ. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేందుకు డైరెక్టుగా ఆయుధాలివ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ప్రేరేపించడం ఆందోళనకరం. ఆ స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పనేనా? ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాధినేత ఒక జాతి నిర్మూలనకు కుట్రపన్నడం సహించరానిది. చట్టసభలకు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనవారు అవినీతి, బంధుప్రీతి, రాగ ద్వేషాలకతీతంగా పనిచేయాలనే రాజ్యాంగ మౌలిక సుత్రాన్ని పాటించని వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉంటుందా? పౌరుల మధ్య ఎలాంటి వివక్షా చూపించకూడదని పదిహేనవ అధికరణం పేర్కొంది. కానీ, ముఖ్యమంత్రి మైతీ తెగకు చెందినవ్యక్తి గనుక కుకీలపై విద్వేషాన్ని పెంచుతూ ఆయన వర్గానికి చెందినవారికి రక్షణగా నిలవడం, కుకీలను వేరుచేయడం క్షమించరానిది. ఇదిలా ఉంటే, వాస్తవాల్ని పరిశీలించి బాధితులకు భరోసానివ్వాలని, అందుకుగాను ప్రధాని మణిపూర్‌ను సందర్శించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టినా మన ‘విశ్వగురు’ మనసు కరగలేదు.అక్కడ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ మాత్రం ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని ఆల్లర్లపై మాట్లాడుతూ ”ఏడాదిన్నరగా జరుగుతున్న అశాంతి, హింసాత్మక ఘటనలతో ఎంతోమంది ఆప్తులను, అనుయాయులను కోల్పోయాం. చాలామంది తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. దానికి నేనెంతో బాధపడు తున్నా. అందుకు నా క్షమాపణలు. ఈ కొత్త సంవత్సరం లోనైనా జాతులు ఐక్యంగా ఉండాలి” అని కన్నీరు కార్చారు. ఆయన చెప్పే ‘నీతివాక్యాల్లో’ నిజాయితీ నేతిబీర చందమని ఇటీవల వెలుగుచూసిన ఆడియో టేపుల సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే బీరెన్‌సింగ్‌ను పదవినుంచి తొలగిస్తే పరిస్థితి చక్కబడేదని ప్రతిపక్షాలే కాదు. బీజేపీ మిత్రపక్షాలు చెబుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదు. ఆయన్ను అలాగే కొనసాగిస్తే గనుక మొదటి దోషి మోడీనే అవుతాడు!