”ఏ దేశమేగినా ఎందు కాలిడినా..
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని..
నిలపరా నీ జాతి నిండు గౌరవము” అంటూ దేశ భక్తిని ప్రేరేపిస్తూ కవి రాయప్రోలు సుబ్బారావు చేసిన నినాదం తెలియని వారుండరు. ఆ నినాదానికి వాస్తవ రూపం గావిస్తూ జాతి గౌరవాన్ని నిలపడమే కాదు జాతి పురోభివద్ధికి ఇతోధికంగా సహాయపడాలనే ఆశయంతో ముందుకు వస్తున్నారు ప్రవాస భారతీయులు.
ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కోసం, వ్యాపారం కోసం, జీవితంలో అభివద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లిన ప్రవాసులైన భారతీయులు తమ కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమిస్తూ ఉన్నత స్ధితికి చేరుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తమ మాతభూమికి చేయూతనివ్వాలనే సదాశయంతో సొంతగడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తున్నారు. ఇటువంటి వారి ఆలోచనలతో మరికొందరికి స్ఫూర్తి కలిగించాలని వారిని గౌరవించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఒక తాటిపైకి తీసురావాలనే ఆలోచన భారత ప్రభుత్వానికి కలిగింది. ఆ ఆలోచనకు రూపమే ”ప్రవాస భారతీయ దివస్”
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విజయాలను ప్రపంచం ముందుకు తీసుకువచ్చి, తద్వారా వారి బలాన్ని, ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేసేందుకు ‘ప్రవాసీ భారతీయ దివస్’ ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులు స్వదేశీయులతో కలిసే అవకాశం కల్పిస్తూ, వారి సేవలను దేశానికి వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి స్వదేశానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 7 నుంచి 9 వరకు ఈ దినోత్సవాన్ని 2003లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఆరంభంలో ప్రతీ ఏడాది నిర్వహించినప్పటికీ 2019 నుంచి రెండేండ్లకొకసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఒడిశా రాష్ట్రంలో జనవరి 7 నుంచి 9 వరకు ఈ ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుతున్నారు.
ప్రవాస భారతీయులు
విదేశానికి వలస వెళ్లిన భారతీయ పౌరులను ప్రవాస భారతీయులు అంటారు. భారతదేశం వెలుపల జన్మించి, భారతీయ మూలం గల వ్యక్తిని లేదా శాశ్వతంగా భారతదేశం వెలుపల స్థిరపడిన వ్యక్తిని భారత సంతతి వ్యక్తిగా పరిగణిస్తారు. ఇదే అర్థాన్ని ప్రతిబింబించే ఇతర పదాలు ఓవర్‌సీస్ ఇండియన్, ఎక్స్‌పేట్రియేట్ ఇండియన్. సాధారణ వినియోగంలో, ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకున్న భారతదేశంలో-పుట్టిన వ్యక్తులను (భారతీయ సంతతికి చెందిన ఇతర దేశాల పౌరులను కూడా) ఈ పరిధిలోకి తీసుకొస్తున్నారు
వీరు రెండు రకాలు
1. NRIలు : వీరు భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరులు. పన్ను ప్రయోజనాల కోసం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, ఒక వ్యక్తి భారతదేశంలో నివాసి కాకపోతే భారతదేశంలో నివాసం లేని వ్యక్తిగా చెప్పబడతారు. ఒక వ్యక్తి అంతకు ముందు ఎప్పుడైనా భారతదేశంలో నివసిస్తున్నట్లు భావించబడతారు.
2.PIO/OCI : వీరు ఒకప్పుడు భారతీయ పౌరులు, కానీ ప్రస్తుతం మరొక దేశ పౌరసత్వం తీసుకొని భారతదేశం వెలుపల నివసిస్తున్నారు. వీరు భారతదేశంతో నేరుగా సంబంధం లేని భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల పిల్లలు కూడా కావచ్చు.
వీరు భారతదేశం వెలుపల ఏ దేశంలోనైనా ఉండవచ్చు (పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు కొన్ని మినహాయింపులున్నాయి).
బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగి విదేశాల్లో స్థిరపడ్డ ఈ ప్రవాస భారతీయులంతా జన్మభూమి రుణం తీర్చుకునేలా విస్తతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు వ్యక్తిగత స్థాయిలో సాయం అందిస్తుండగా. మరికొందరు ట్రస్టులు ఏర్పాటు చేసి, వాటి ద్వార భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గ్రామాభివద్ధి కోసం కొంతమంది నిధులు వెచ్చిస్తుండగా.. మరికొందరు విద్యార్థుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇంకొందరు చిన్నతనంలో తాము చదువుకున్న బడికి కొత్తరూపు కల్పించి తమ ఔదార్యం చాటుకుంటున్నారు.
కొద్దిమందైతే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, నైపుణ్యాభివద్ధి కేంద్రాల వంటివీ ఏర్పాటు చేశారు. తమ ఊళ్లోని అందరికీ తాగునీరు ఉచితంగా అందేలా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో సేవలందిస్తూ కన్నభూమి రుణం తీర్చుకుంటున్నారు.
ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లింది భారతీయులే. మన దేశం తర్వాత స్థానాల్లో మెక్సికో (1.1కోట్లు), రష్యా (1.1కోట్లు), చైనా (కోటి), సిరియా (80లక్షలు) దేశాలున్నాయి.
ఇక దేశాల వారిగా చూసుకుంటే అత్యధిక మంది భారత ప్రవాసులు ఉంటుంది మాత్రం గల్ఫ్ దేశాల్లోనే అని చెప్పాలి. గల్ఫ్ కూటమిలోని 6 దేశాల్లో (సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, కువైత్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్) నివసిస్తారు. ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే 35 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 25 లక్షల మంది వరకు ఉంటున్నారు. కువైత్‌లో 10లక్షలు, ఖతార్‌లో 7.5లక్షలు, ఒమన్‌లో 7.8లక్షల వరకు ఉన్నారు. ఇలా ప్రవాసుల్లో 90లక్షల వరకు అంటే సగం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా 27లక్షల మంది వరకు భారతీయులు ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో సైతం భారత ప్రవాసులు భారీగానే ఉన్నారు. సుమారు 7.83లక్షల మంది భారతీయులూ, భారతీయ మూలాలు ఉన్నవారు నివాసం ఉంటున్నట్టు అక్కడి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 12లక్షల వరకు ఉంటుందని విదేశాంగశాఖ తెలిపింది. మన విద్యార్థులు అత్యధికంగా వెళ్తున్న దేశాల జాబితాలో కెనడా, అమెరికా, ఆసీస్, బ్రిటన్ ఉన్నాయి.
ప్రవాసులు అత్యధికంగా ఉన్న మొదటి మూడు దేశాలు… యూఏఈ (35 లక్షలు), అమెరికా (27 లక్షలు), సౌదీ అరేబియా (25 లక్షలు) ఉన్నారు. ప్రవాస భారతీయులూ, భారత సంతతి వారూ కలిపి ఎక్కువగా ఉన్నది మాత్రం అమెరికాలో. వీరి సంఖ్య 45 లక్షలు.
ప్రతీ ఏటా 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస వెడుతున్నట్టు తెలుస్తుంది. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరించవచ్చు.
ప్రపంచమంతా విస్తరించి ఉన్న మన భారతీయులు కొన్నిచోట్ల ఆర్థిక రంగానికి ఆయువుపట్టుగా నిలిస్తే… ఇంకొన్ని దేశాల్లో రాజకీయాల్ని శాసించే స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కతీ, సంప్రదాయాల్నీ వారు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు.
ఈ విధంగా భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది.అంతే కాకుండా భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను కూడా అధిరోహిస్తున్నారు.
వారిలో అమెరికా ఉపాధ్యక్ష పదవిని అలంకరించిన కమలా హారిస్, రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతో పాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేషియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పని చేస్తున్నారు. సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నం కూడా ఆ జాబితాలో చేరారు.
8 అమెరికా పార్లమెంటులోనైతే రాజా కష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, తానేదార్ల మొదలైన మనవాళ్ళు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
8 2015 నుంచీ పోర్చుగల్ ప్రధానిగా కొనసాగుతున్న ఆంటోనియో కోస్టా భారత్, పోర్చుగీసు మూలాలున్న వ్యక్తి.
8 కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ ఎలెక్ట్ క్రిస్టిన్ కార్లా కంగాలూ కూడా ఇండో-ట్రినిడాడ్ కుటుంబం నుంచి వచ్చారు.
8 2017 నుంచి మారిషస్ ప్రధానిగా ఉన్న ప్రవింద్ జగన్నాథ్ హిందూ యదువంశ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత ముత్తాతలు 1870లో ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడికి వలస వెళ్లారు. సురినామ్ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి, గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకల్వాన్, మారిషస్ అధ్యక్షుడు పథ్వీరాజ్సింగ్ రూపన్లూ భారతీయ మూలాలున్నవారే! కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మనవాళ్లు అనేక మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే హైదరాబాద్లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికయ్యారు.
వీరు కాకుండా వివిధ దేశాల కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎస్.ఆర్.నాథన్ (1999 – 2011), దేవన్ నాయర్ (1981 -1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే.
2021లో తయారు చేసిన ఓ జాబితా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో భారత సంతతి నేతలు 200 మందికి పైగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీరిలో 60 మందికి పైగా కేబినెట్ మంత్రి పదవుల్లో ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం.. 2020 -21 ఏడాదిలో భారత్‌కు ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు కాగా 2022లో ప్రవాసులు స్వదేశానికి పంపిన మొత్తం రూ. 8.2 లక్షల కోట్లు. ఈ విషయంలో ప్రపంచం లోనే భారతే అగ్రస్థానం. గతానికి భిన్నంగా ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి కాకుండా అమెరికా, కెనడా, యూకే, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి ఎక్కువ మొత్తం వస్తోంది. ఆరు గల్ఫ్ దేశాల నుంచి 28 శాతం వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 23శాతం వస్తోంది. 2024లో ఇలా అత్యధిక సొమ్మును పంపింది భారతదేశానికే. ప్రవాస భారతీయులు, విదేశాల్లో ఉద్యోగాలు చేసే భారతీయులు.. ఇలాంటి వారంతా 129.1 బిలియన్ డాలర్లు అంటే రూ.11 లక్షల కోట్లకుపైగా మన దేశానికి పంపారు. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికీ ఇంతమొత్తం రాలేదు. 2024లో ప్రపంచదేశాలకు వచ్చిన మొత్తంలో మనదేశానికి వచ్చిన మొత్తం14.3 శాతం కాగా జీడీపీలో 2024లో మనదేశానికి వచ్చిన మొత్తం విలువ 3.3 శాతంగా ఉంది.
ప్రవాస తెలుగు వారి ఖ్యాతి
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వివిధ వత్తి ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో తెలుగువారు అనేకులు ఉన్నారు. పలువురు ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. రాజకీయ పదవుల్లో కూడా రాణిస్తున్నారు. విదేశాల్లో బాగా సంపన్నులుగా ఎదిగిన తెలుగువారు, సొంత ప్రాంతాల్లో, సొంత డబ్బులతో అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏటా తెలుగు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల రూపేణా ఖర్చవుతున్న ఎన్నారై తెలుగువారి సొమ్ము వందల కోట్ల రూపాయలలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు, విదేశాల్లో ఎదిగినవారు స్వదేశంలోనూ పరిశ్రమలు పెడుతున్నారు. వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. సొంత ప్రాంతాల్లో వందల వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇంకొందరైతే తమ సొంతూరిలోని ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వటం, నిర్మాణానికి కొంత ఆర్థిక చేయూత అందించటం, ఎత్తిపోతల పథకాలు నిర్మించటం వంటివీ చేస్తున్నారు.
తెలుగువారు ప్రవాసులుగా ఎదుగుతున్న ప్రతి పరిణామమూ తెలుగు ప్రాంత అభివద్ధికి నేరుగానే కారణం అవుతోంది.అగ్రరాజ్యం అమెరికాలో సుమారుగా అయిదు లక్షల పైచిలుకు తెలుగువారు ఉన్నారనేది ఒక అంచనా! కేవలం అమెరికా నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఎన్నారైలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు కొన్ని వందల కోట్లు. అమెరికాలో తెలుగు సంఘాలు కూడా అనేకం ఏర్పడ్డాయి. ఈ సంఘాలు సేవా కార్యక్రమాలతో పాటు తెలుగు భాషా సాహిత్యం, సంస్కతీ వైభవాలను పరిరక్షించే దిశగా కూడా ప్రవాస తెలుగు సంఘాలు ఎంతగానో కషి చేస్తున్నాయి. అమెరికాలో తొలి తెలుగు సంస్థ ‘తానా’ ఈ దిశగా అందరికీ మార్గనిర్దేశం చేసిందనే చెప్పొచ్చు. ఆటా, నాటా వంటి అనేక ఇతర సంఘాలు ఇలాంటి సత్కార్యక్రమాలను అనుసరిస్తున్నాయి.
ఈ సారి ఒడిశాలో…
ప్రపంచంలోని భారతీయులందరినీ ఒకచోట చేర్చే ప్రతి రెండేండ్లకోసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాసీయుల దినోత్సవ వేడుకలు ఈ సారి ఆలయాల నగరం భువనేశ్వర్‌లో జనవరి 8 నుంచి 10 వరకు భారీ వేడుకలతో నిర్వహించడానికి ఒడిశా సిద్ధమైంది.
ఈ వేడుకలో ఎంతో మంది అతిథులు, విదేశాల్లో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగు పరచడంలోనూ విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. మన దేశం వివిధ రంగాల్లో అభివద్ధి చెందడానికి గొప్పగా సహకరించిన ప్రవాసులకు ఈ వేడుకలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్వదేశానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవాస భారతీయులు పట్ల ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు బాధ్యతను, సహకారాన్ని అందించి ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ వేడుక ఎంతగానో ఉపయోగ పడుతుంది.
విదేశాల్లో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగి రావడానికి దేశాధికారులతో మాట్లాడటం వంటి కీలకాంశాలు ఈ సమావేశాల నిర్వహణ ద్వారా మెరుగుపడతాయి.
దేశాభివద్ధికి భారతీయ ప్రవాసుల కషిని గుర్తించే లక్ష్యంతో ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 7,000 మంది ప్రవాసులు, 10,000 మంది అతిథులు వస్తారని భావిస్తున్నారు. ”అభివద్ధి చెందిన భారతదేశంలో డయాస్పోరా పాత్ర” అనే థీమ్‌తో మూడు రోజుల కార్యక్రమం ఒడిశా గొప్ప కళ, సంస్కతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.
‘అభివద్ధి చెందిన భారతదేశంలో డయాస్పోరా పాత్ర’ అనే అంశం 2047 నాటికి ప్రగతిశీల, ఆర్థికంగా దఢమైన భారతదేశం కోసం దష్టిని ప్రతిబింబించడానికి సాంకేతికత పాత్ర, దేశ వద్ధి పథంలో ప్రవాసుల సహకారంపై ఈ సమావేశంలో దష్టి పెట్టనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు రూ. 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిని ఒడిశా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమానంగా పంచుకుంటాయి.
ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు
విదేశీ భారతీయులకు అందించే అత్యున్నత గౌరవమే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు. భారత ప్రభుత్వం 2003లో ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రారంభించింది. ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. దేశంలో దాతత్వ పెట్టుబడులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విదేశాల్లో భారతీయులు సాధించిన విజయాలు, ఇండియా ప్రతిష్ట పెరిగే కార్యక్రమాలు విదేశాల్లో అమలు పరచడం, భారతదేశం, విదేశీ భారతీయ సమాజం, వారి నివాస దేశం మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరచడం, స్థానిక భారతీయ సమాజ సంక్షేమం, స్వదేశంలో దాతత్వ కార్యక్రమాలు నిర్వహించడం, తమ రంగంలో తమ వత్తిలో ఔన్నత్యాన్ని సాధించడం, దేశ విదేశాల్లో సామాజిక, మానవతా విలువల పట్ల శ్రద్ధ, భారతదేశ ప్రతిష్టను పెంచిన నైపుణ్యాల్లో గొప్పతనం వంటి అంశాల్లో ఏదైనా ఒక దానిలో గణనీయమైన కషి చేసిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
మేధో వలస సమస్య
ప్రపంచ దేశాలకు మేధావులను అందించడంలో భారత్ కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచాన్ని శాసిస్తోన్న కీలక సంస్థలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తూ ఉన్నది భారతీయులే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు. అయితే మేధస్సు కలిగినవారు స్వదేశంలో మంచి అవకాశాలు లభించకపోవడం వంటి అనేక కారణాలు వల్ల స్వదేశాన్ని వీడి వెళ్లడం లేదా మేధో వలస అనేది మాత్రం భారతీయుల్ని ఎక్కువగా కలవరపెడుతున్న అంశంగా చెప్పవచ్చు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం.. వలసపోతున్న నిపుణులూ, విద్యావంతుల్లో భారతీయులే ఎక్కువ. భారత్ నుంచి 100 మంది విదేశాలకు వెళ్తే వారిలో 65 శాతం నిపుణులూ, విద్యావంతులే. 2000-2020 మధ్య కోటి మంది భారత్‌ను విడిచి వెళ్లారు.
పార్లమెంట్ లెక్కలు
2015 నుంచీ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2015లో 1,31,489, 2016లో 1,41,603, 2017లో 1,33,049, 2018లో 1,34,561, 2020లో 85,242, 2021లో సెప్టెంబర్ వరకు 1,11,287 మంది భారతీయులు స్వదేశాన్ని వీడారు. వీరిలో వేల సంఖ్యలో మిలియనీర్లు ఉన్నారు.
ఇంతకంటే ఆందోళన కలిగించే మరొక విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది కనీసం లక్ష మంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేల మందికి పైగా భారతీయ పౌరసత్వానికి స్వస్తి పలికారు. పైగా సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభమయ్యింది. మన ఆర్థిక వ్యవస్ధపై నమ్మకం లేకపోవడం, దేశంలో పన్నుల వ్యవస్ధ ఈ పరిస్ధితికి కారణంగా వారు చెబుతున్నారు.
విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న వాళ్లు కచ్చితంగా భారత పౌరసత్వాన్ని వదులుకోక తప్పదు. ఎందుకంటే ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ అనుమతించదు. దీంతో.. విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న అనేక మంది తమ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇటువంటి వారందరూ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఓసీఐ ద్వారా ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, నివాసం ఉండేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుంది. విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నప్పుడు మేధో వలస జరగకుండా అపాలంటే మేధావుల విజ్ఞానం మాతదేశ అభ్యున్నతికి ఉపయోగించుకోగలగాలి. అప్పుడే దీనిని అరికట్టగలం. దానికి మెరుగైన అవకాశాలు, ప్రోత్సాహకాలు మనం కల్పించగలిగితే ఆ విలువైన మానవ వనరులను మనమే ఉపయోగించుకుని దేశాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లగలం. మన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.. వాళ్ళు డబ్బు పంపుతున్నారు, వాళ్ళు సేవలు చేస్తున్నారు అని సంబరపడి సరిపెట్టుకున్నంత కాలం మేధో వలస అప్రతిహతంగా కొనసాగుతూనే వుంటుంది. ప్రతీ రెండేండ్లకు ఒకసారి నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలో భారత విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న ప్రవాస భారతీయులను మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భరతమాత ముద్దుబిడ్డలుగా కీర్తిస్తున్నాం. అవార్డులు అందించడంతో సరిపెట్టుకుంటున్నాం.
ఈ వేడుకలు కూడా పాశ్చాత్య దేశాల్లో నివాసం ఉంటున్న వారి కోసం జరుగుతున్నాయనే విమర్శ కూడా గత కొద్దికాలంగా బలంగా వినిపిస్తోంది. ఈ ప్రవాసీ దివస్ సందర్భంగా గల్ఫ్‌లోని ప్రవాసుల సమస్యలు లేదా అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం బహిరంగ సత్యం. అందుకే ఈ వేడుక పెద్దోళ్ల పెండ్లిలో పేదలకు అవమానం అన్న చందంగా ఉంటుందనే విమర్శ కూడా ఉంది. ప్రతీ ఏడాది ఈ వేడుకను నిర్వహించడం భారంగా భావించి రెండేండ్లకు ఒకసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా ముగింపు పలికినట్టు కాకూడదు. అలా చేయకపోతే పాశ్చాత్య దేశాల పౌరసత్వం పొందిన సంపన్న ప్రవాసీయుల జాతరగా మాత్రమే ఈ వేడుక మిగిలిపోతుంది. రెండేండ్లకు ఒక పర్యాయం ప్రవాస భారతీయులను స్మరిస్తూ వేడుకలు జరపడం కన్నా, నిత్యం ప్రవాస భారతీయుల నైపుణ్యాలు, సేవలు భారతదేశం వచ్చేలా ప్రోత్సహించాలి. అందుకు తగ్గ పరిస్థితులను కల్పించాలి. అప్పుడే విదేశాల్లోని మన వారి కషి ఫలితాన్ని మనం పొందగలం. అలా కాకుండా ‘ప్రవాస భారతీయులందరూ భారత అంబాసిడర్లు. మీరంతా దేశానికి దూతలు. దేశ బ్రాండ్ అంబాసిడర్‌గా మీ పాత్ర విభిన్నం’ అని ఎన్ని పొగడ్తలు చేసినా ప్రయోజనం ఉండదు. అందుకని, మన దేశ విదేశీ వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎన్నారైల సేవలను మరింత సమర్థంగా వినియోగించు కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశీయంగా మౌలిక సౌకర్యాలు మెరుగు పడతాయి. ఆర్థికంగా కూడా దేశం అభివద్ధి చెందుతుంది.
ప్రపంచం నలుమూలలా..
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 210 దేశాల్లో 3.2కోట్ల మంది భారతీయులు, భారత సంతతి వారు ఉంటున్నారు. వీరిలో 1.8 కోట్ల మందికి వారు ఉంటున్న దేశాల పౌరసత్వం ఉంటే.. 1.4కోట్ల మంది మాత్రం భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి.
బహుళజాతి కంపెనీల్లో భారతీయ సీఈఓలు
ప్రముఖ బహుళజాతి కంపెనీల్ని నడిపించిన నడిపిస్తోన్న భారతీయ సీఈఓల్లో కొందరు…
ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచారు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన అగర్వాల్, శంతను నారాయణ్-అడోబ్, అరవింద్ కష్ణ- ఐబీఎం, నికేశ్ అరోరాపాలొ ఆల్టో నెట్‌వర్క్స్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి, అర్వింద్ కష్ణ- ఐబీఎమ్, గుంజన్ షా- బాటా, వసంత్ నరసింహన్- నోవార్టిస్, రేవతి అద్వైతి- ఫ్లెక్స్, పునీత్ రంజన్- డెలాయిట్ వంటి వారందరూ భారతీయ మూలాలున్న వారే.
నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేషియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! ఇక ఆర్ధికంగా అత్యున్నత స్ధితికి చేరుకున్న ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు, ఒక దేశం మూలాలు ఉండి ఇతర దేశాల్లో స్థిరపడినవారు ఇలాంటి వారు చాలామంది. వారంతా తమ తమ దేశాల్లోని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు డబ్బు పంపుతుంటారు. ఈ విషయంలో స్వదేశానికి ఎక్కువ సొమ్ము పంపడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
మినీ ఇండియాలు
ప్రపంచంలో భారతీయ సంస్కతీ, సంప్రదాయాలూ, రుచులతో ‘మినీ ఇండియా, లిటిల్ ఇండియాలు’గా పేరు తెచ్చుకున్న ప్రాంతాలు ఉన్నాయి.
– లిటిల్ ఇండియా, కౌలాలంపూర్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్ లోని బ్రిక్ఫీల్డ్స్ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి స్థానికుల్లో ఎక్కువమంది భారతీయ మూలాలున్న వారే. భారత్‌లో దొరికే ప్రతి వస్తువూ ఇక్కడ లభిస్తుంది.
– డెవాన్ ఎవెన్యూ, షికాగో : అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తే పెద్దఎత్తున భారతీయ రెస్టరెంట్లే కాదు… చీరల దుకాణాలూ అత్యధికంగా ఉంటాయి.
– లిటిల్ ఇండియా, సింగపూర్: మన దేశ సంస్కతి కనిపించే ఈ ప్రాంతంలో భారతీయ రెస్టరెంట్లూ, దుకాణ సముదాయాలూ చాలా ఎక్కువ. అన్నిరకాల రుచులూ దొరుకుతాయి.
– రూ దు ఫాబొ, ప్యారిస్ : ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ వెళ్లిన మనవాళ్లు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం రూ దు ఫాబొ. అక్కడ భారతీయులకు అవసరమైన దేశీయ సరకులే కాదు, ప్యారిస్ ఫ్యాషన్లు అద్దిన దుస్తులూ అక్కడ లభిస్తాయి.
రుద్రరాజు శ్రీనివాసరాజు 9441239578