హిందీ తెలుగు భాషా సాహిత్యాల ‘ద్వివాగీశ్‌’

'Dwivagish' of Hindi Telugu language literatureహైదరాబాద్‌ సాంస్కృతికంగా గంగా జమునా తహజీబ్‌కే కాదు, భాషా సాహిత్యాల పరంగా ఆదాన్‌ ప్రదాన్‌కు ఆలవాలం. తొలి నాళ్ళ నుండి ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ భాషల రచయితలకు ఆలవాలంగా నిలిచింది. నేటి తరంలోనూ ఆ వారసత్వం కొసాగుతోంది. వందలాది మంది తెలుగు, హిందీ, ఉర్దూతో పాటు ఆంగ్లం తదితర భాషల్లో రచనలు, అనువాదాలు చేస్తున్నారు. అటువంటి వారిలో హిందీ, తెలుగు తెలిసి ఒక భాషలోంచి మరొక భాషలోకి నేరుగా అనువాదం చేస్తున్న రచయిత, అనువాదకులు, బాల సాహిత్యకారులు ‘ద్వివాగీశ్‌’గా హిందీ తెలుగు సాహితీ లోకంలో పరిచితులైన శ్రీ గుడ్ల పరమేశ్వర్‌.
సికింద్రాబాద్‌ తుకారాం గేట్‌లో జులై, 1948న జన్మించారు గుడ్ల పరమేశ్వర్‌. శ్రీమతి వీరమ్మ, శ్రీ నీలయ్య వీరి తల్లితండ్రులు. హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందినప్పటికీ, భారత్‌ స్కౌట్స్‌ Ê గైడ్స్‌లో తెలంగాణ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ ‘సాహిత్య రత్న’ ‘హిందీ విద్వాన్‌’ తెలుగు నుండి హిందీకి, హిందీ నుండి తెలుగులోకి ముప్పైఐదుకు పైగా గ్రంథాలు అనువాదం చేశారు. ఇవేకాక ఆరు మౌలిక రచనలు, బాల సాహిత్య రచనలు ఉన్నాయి. 1999లో ‘సుమతి శతకం’ హిందీలోకి అనువదించడంతో ప్రారంభమైన వీరి అనువాద పరంపర నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఇండియా మొదలు సాహిత్య అకాడమి వరకు సాగింది. ‘కృష్ణశతకం’, ‘రెసిడెన్సీ’ నవల, ‘తెలుగు కావ్య ప్రభ’, ‘నన్హే పరిష్తా’, ‘నయగ్రా’ ఖండ కావ్యాలను హిందీలోకి తెచ్చారు. ప్రజాకవి కాళోజీ ‘నా గొడవ’ కవితలను ‘మేరీ అవాజ్‌’గా హిందీలోకి అనువదించారు. ‘చందమామ రావే’ బాల గీతాలు ‘చందమామ ఆజా’ పేరుతో తెచ్చారు. సినారె గారి ‘నా రణం మరణం పైనే’, తెలంగాణ సాహిత్య అకాడమి కొరకు ‘అస్తిత్వం’, ‘పరంపర’ కథా సంకలనాలు హిందీ లోకి తెచ్చారు. ఇవేకాక హిందీ లోంచి తెలుగులోకి ముప్పై పుస్తకాలు తెచ్చారు. ‘తృతీయ సోపాన్‌’ తెలుగులో, ‘సాయిల్‌ కంజర్వేషన్‌’, ‘గోల్డన్‌ పర్సనాలిటీస్‌ ఆఫ్‌ భారత్‌ స్కౌట్స్‌ Ê గైడ్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆంగ్లంలో, ‘భారత్‌ స్కౌట్స్‌ Ê గైడ్స్‌ సంక్షిప్త ఇతిహాస్‌’ హిందీలో గుడ్ల పరమేశ్వర్‌ మౌలిక రచనలు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మెడల్‌ ఆఫ్‌ మెరిట్‌ మొదలుకుని మహారాణా ప్రతాప్‌ పురస్కారం, గార్గీ గుప్త అనువాద పరిషత్‌ అవార్డ్‌, కేంద్రీయ హిందీ నిర్దేశాలరు వారి లక్షరూపాలయల నగదు బహుమతి వంటి అనేక జాతీయ స్థాయిలో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.
బాల సాహిత్యం అనువాదాలతో పాటు మౌలిక రచనలు చేశారు పరమేశ్వర్‌. దాదాపు ఇరవైనాలుగు మంది తెలుగు బాల సాహితీ వేత్తల కథలను హిందీలోకి అనువదించి ఉత్తర భారతీయులకు తెలుగు బాల కథావెలుగులను పంచారు. హిందీ బాలల కథలను ‘పువ్వులను ప్రేమించు’, ‘ఇద్దరు అపరిచితులు’ పేరుతో తెలుగులోకి తెచ్చారు.
‘అమ్మభాష పలుకు వారికి అభినందనం/ అమ్మ భాష ఉన్నచోటే బృందావనం’ అని చాటి చెప్పిన పరమేశ్వర్‌ ఇటీవల ప్రచురించిన బాల గేయ సంపుటి ‘గేయ మాలిక’. ఇందులోని గేయాలు ప్రధానంగా స్కౌట్‌ Ê గైడ్స్‌ పిల్లలకు క్యాంప్‌ ఫైర్‌ సందర్భంగా ఆడుతూ, పాడుకోవడానికి రాసినవి. ఇటువంటి గేయాలు తెలుగులో తక్కువనే చెప్పాలి. ఆ ఖాళీని గుడ్ల పరమేశ్వర్‌ పూరించడం అభినందనీయం. ‘ఇంట్లో కిచెన్‌ ఎంత మంచిది/ ఎప్పుడు ఘుమ ఘుమ లాడుతుంటది/ అన్నముడికితె కుత కుత మంటది/ సాంబార్‌ మసిలితె సలసల మంటది’ అంటూ కిచెన్‌ గమ్మత్తుగా పరిచయం చేస్తూ, ‘అబద్ధమెప్పుడు ఆడకూడదు/ నిజమును ఎప్పుడు పలకాలి /.. స్వార్ధబుద్ధిని తెగనరకాలి/ మేలు పనులను చేపట్టాలి’ అంటూ పిల్లలకు హితవు చెబుతారు. పల్లె అన్నా అక్కడి జీవన విధానమన్నా ఈ కవికి ఎక్కువ యిష్టం. చాలా గేయాల్లో చూడొచ్చు, ‘తెల్లవారినది కోడి కూసినది/ పల్లె మొత్తము నిదుర లేచినది’ అని చెప్పినా, ‘చెట్టు మీద పువ్వు చూడు ఎంత ముద్దుగున్నది/ చూపరుల మనసులనే ఆకట్టుకున్నది’ అని చెప్పినా అది ఆ దృష్టి తోనే. ‘ఎండా కాలం ఎంత కష్టమో’, ‘చలికాలం చల్లగనుండును’, ‘ఎంత ఘోరమో వర్షాకాలము’ అంటూ మూడు కాలాల్లో పిల్లల మనస్తత్వాలను చెబుతారు. భాష గురించి, పడవ, ప్రకృతి, కోతి, చెట్టు, చామా, జోకర్‌ యిలా అనేక అంశాలు వీరి గేయాల్లో చక్కగా ఒదిగి బాల బాలికలకు తాయిలంగా మారాయి. స్కౌట్‌తో శారీరకంగా పిల్లలను చక్కటి క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చి దిద్దుతూనే, భౌతికంగా బాల గేయాలతో తట్టిలేపుతున్నారు ఈ ద్వివాగీశ్‌. ‘దేశమాతకు ముద్దు బిడ్డలం/ మేమే రేపటి దేశ పౌరులం/ మంచి మాటలే మేము మాటలాడెదం/ కులమత బేదాన్ని దూరం చేసెదం’ అంటూ బాలల్ని తన గేయాలతో చైతన్య పరచి వాళ్ళతో భావి భారతానికి భరోసా యిప్పిస్తారు కవి పరమేశ్వర్‌. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548