బీఆర్‌ఎస్‌ పాపాల్లో బీజేపీకీ పాత్ర

BJP also has a role in the sins of BRS– అలరుబలరుతోనే లక్ష కోట్ల రుణం : మంత్రి ఉత్తమ్‌ విమర్శ
– ఎల్‌అండ్‌టీకి రూ.400 కోట్లు ఆపాం
– బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు
– ఎన్‌డీఎస్‌ఏ విచారణను స్వాగతిస్తాం
– నెలలోనే ప్రాథమిక నివేదిక
– మరికొంత మంది ఇంజినీర్లపై చర్యలు
– వర్షాకాలానికి ముందే మరమ్మత్తులు
– ఆ రుణాలన్నీ కేసీఆర్‌,కేటీఆర్‌ కట్టాల్సిందే…
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సర్కారు పాపాల్లో బీజేపీకి కూడా పాత్ర ఉందని రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు, అభివృద్ధి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్యే బి.లక్ష్మిరెడ్డితో కలిసి మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ రెండు పార్టీల మధ్య అలరుబలరు ఉందనీ, అందుకే రూ. లక్ష కోట్ల రుణం వచ్చిందని గుర్తు చేశారు. మేడిగడ్డ నిర్మాణలోపం నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెల్లించాల్సిన రూ.400 కోట్ల బిల్లులను ఆపామని ప్రకటించారు. కాళేశ్వరంపై విజిలెన్స్‌ నివేదిక అందిందనీ, బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్‌లో ఉన్న రుణాలను కేసీఆర్‌, కేటీఆర్‌లే కట్టాలని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్‌ఎస్‌ లీడర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.తుమ్మిడ హెట్టివద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారనీ, అక్కడ 160 టీఎంసీల మేరనీళ్లున్నట్టు సీడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. మేడిగడ్డ..ఓ బొందల గడ్డ ఏం పీకపోతరు అన్నారనీ, ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ లీడర్లు కమీషన్లకు కక్కుర్తిపడి తెలంగాణ ప్రజలు, రైతుల భవిష్యత్‌ను పణంగా పెట్టారని అన్నారు. మేడిగడ్డ విచారణకోసం ఎన్డీఎస్‌ఏ కమిటీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్డీఎస్‌ఏ ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాను శనివారం ఢిల్లీ వెళుతున్నాననీ, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులు, అధికారులను కలుస్తానని మంత్రి చెప్పారు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రాణహిత-చేవెళ్లను పూర్తిచేస్తే కాంగ్రెస్‌కు క్రెడిట్‌ వస్తుందనే కుట్రతోనే కేసీఆర్‌ రీడిజైన్‌ చేశారని వ్యాఖ్యా నించారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వానివి భారీ తప్పులని చెప్పారు. బీఆర్‌ఎస్‌ తీరు హాస్యాస్పదమని చెప్పారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరగాలనీ, ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీతప్పులు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం జియాలాజి కల్‌ సర్వే చేయలేదనీ, అందుకే ఆ సమాచారాన్ని ఎన్‌డిఎస్‌ఏకు పంపలేద న్నారు. గత ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే ప్రాజెక్టుల్లో భారీ అవినీతి, తప్పులు జరిగాయని చెప్పారు. విజిలెన్స్‌ నివేదికపై న్యాయసలహా తీసుకుని కేసులు పెడతామని ప్రకటించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్‌ ఇప్పటివరకు మేడిగడ్డ ఘటనపై మాట్లాడ లేదని చెప్పారు.రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు నష్టం చేశారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయినట్టు కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ప్లానింగ్‌, డిజైన్‌.నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అసమర్థత కనిపించిందన్నారు. పాత ప్రాణహితకు రూ.1000 కోట్ల కరెంటు బిల్లు వస్తే, కాళేశ్వరం విషయంలో రూ. 10,500 కోట్ల బిల్లు వస్తుందని గుర్తుచేశారు. విజిలెన్స్‌ నివేదిక ప్రకారం ఇద్దరు అధికారులపై వేటు వేశామనీ, ఒకటి, రెండు రోజుల్లో మరికొంత మందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాకాలానికి ముందే మరమ్మత్తులు చేస్తామని మీడియా అడిగిన ప్రశ్నికు సమాధానమిచ్చారు.