– హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం
– ప్రజలను మభ్యపెట్టి.. మోసం చేయడమే వారి నైజం: మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
నవతెలంగాణ-జహీరాబాద్
హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, దొందూ దొందే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం.. ఎన్నికల అనంతరం ప్రజలను నట్టేట ముంచడమే కాంగ్రెస్, బీజేపీ నైజమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి.. సామాన్యుల నడ్డి విరించిందన్నారు. యువతకు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. జహీరాబాద్ ఎంపీ స్థానం ఓడినంత మాత్రాన ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోదని.. గల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పోదని.. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే హామీల అమలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రం నుంచి వేలకోట్లలో పన్నులు వసూలు చేసిన బీజేపీ ప్రభుత్వం.. ఇచ్చేటప్పుడు మాత్రం మూలుక్కుంటూ ఇవ్వడంతో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలుపరచాలన్నారు. కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలనపై, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయని.. వాటన్నింటినీ కూడా వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే 8 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యాయని.. వారి స్థానంలో నూతన రిక్రూట్‌మెంట్ చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్ఛే విధంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే, హామీల అమలుపై ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమని, స్థలాన్ని కూడా వారే ప్రకటించాలని, ఈ చర్చకు ముఖ్యమంత్రి వస్తారా.. ఎవరొస్తారు అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే కేసీఆర్ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, డీసీఎంఎస్ చైర్మెన్ శివకుమార్, మహమ్మద్ తంజీం, గుండప్ప యాదవ్, షేక్ ఫరీద్, నామ రవి కిరణ్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.