మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ– రెండో జాబితాలోనూ మాజీ బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రాధాన్యత
—  మొత్తం 72 మందితో రెండో జాబితా విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలోని మరో ఆరు లోక్‌సభ స్థానాలకు బీజేపి అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌ నగర్‌-డీకే అరుణ, మెదక్‌-రఘునందన్‌ రావు, ఆదిలాబాద్‌ -గోడెం నగేష్‌, మహబూబాబాద్‌-సీతారాం నాయక్‌, నల్లగొండ -సైదిరెడ్డి, పెద్దపల్లి-గోమాసె శ్రీనివాస్‌కు అవకాశం కల్పించారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలుండగా…తొలి జాబితాలో తొమ్మిది స్థానాలకు, తాజా జాబితాలో ఆరు స్థానాలకు బీజేపి అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఖమ్మం, వరంగల్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ మొత్తం 72 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. కర్ణాటక 20, మహారాష్ట్ర 20, గుజరాత్‌ 7, హర్యానా 6, తెలంగాణ 6, మధ్యప్రదేశ్‌ 5, హిమాచల్‌ ప్రదేశ్‌ 2, ఢిల్లీ 2, ఉత్తరాఖండ్‌ 2, త్రిపుర 1, దాద్రానగర్‌ హవేలీ 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా… బీజేపి ఇప్పటి వరకు సొంతగా 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 195, తాజా జాబితాలో 72 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
రెండో జాబితాలోనూ మాజీ బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రాధాన్యత
రెండో జాబితాలోనూ మాజీ బీఆర్‌ఎస్‌ నేతలకు బీజేపి ప్రాధాన్యతనిచ్చింది. మొత్తం ఆరు స్థానాలను ప్రకటించగా… ఇందులో ముగ్గురు బీఆర్‌ఎస్‌ మాజీలే కావడం గమనార్హం. తొలి జాబితాలోనూ మొత్తం తొమ్మిది మందికి అవకాశం కల్పించగా… బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఐదుగురికి అవకాశం ఇచ్చింది. ఇందుల్లో సిట్టింగ్‌ ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్‌ ఉన్నారు. అయితే సిట్టింగ్‌ ఎంపీగా రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడు పోతుగంటి భరత్‌కు నాగర్‌కర్నూల్‌ సీటు కేటాయించింది. మొదటి జాబితాలో మాదిరిగానే… రెండో జాబితాకు రెండు రోజుల ముందు పార్టీలో చేరిన నేతలకు అవకాశం కల్పించింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్‌ (సీఈసీ)కి ముందు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, జి నగేశ్‌, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ గోమాసే పార్టీలో చేరారు. వీరితో పాటు ఖమ్మం సీటు ఆశిస్తూ… బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జలగం వెంకట్రావ్‌కు మినహా మిగిలిన నలుగురు పేర్లను బీజేపీ రెండో జాబితాలో ప్రకటించింది. మరోవైపు గాయకుడు, రచయిత మిట్టపల్లి సురేందర్‌కు పెద్దపల్లి అభ్యర్థిగా చివరి వరకు ఆశ చూపి… జాబితాలో మాత్రం శ్రీనివాస్‌ గోమస్‌కు అవకాశమిచ్చింది.
మహబూబ్‌ నగర్‌ సీటు అరుణకే
ఎట్టకేలకు మహబూబ్‌ నగర్‌ స్థానాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దక్కించుకున్నారు. తొలి నుంచి ఈ స్థానానికి అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత శాంతి కుమార్‌లు పోటీ పడగా… కోర్‌ గ్రూప్‌ మీటింగ్‌లో స్వయంగా అమిత్‌ షా అరుణ, జితేందర్‌ల పేర్లను పక్కన పెట్టారు. అయితే మొదటి జాబితా లోనూ వీరి పేర్లు లేకపోవడంతో… ఆ సీటు తమకే దక్కుతుందని ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌ నగర్‌ గడ్డ… జితేందర్‌ రెడ్డి అడ్డ అంటూ మాజీ ఎంపీ బలంగా తన వాయిస్‌ వినిపించారు. ఢిల్లీ పెద్దలను కలిసి ఆ సీటు తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే… అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడం, ప్రచారంలో తన వంతు పాత్ర పోషిస్తూ వస్తోన్న డీకే అరుణకు అధిష్టానం జై కొట్టింది. మరోవైపు మెదక్‌ స్థానంపై కూడా భిన్న స్వరాలు వినిపించాయి. తొలి నుంచి ఈ స్థానానికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందర్‌ రావు పోటీ పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే మొదట్లో ఆయన పేరే వినిపించినా… మధ్యలో అంజిరెడ్డి పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది. బుధవారం ప్రకటించిన రెండో జాబితాలో రఘునందన్‌కే మెదక్‌ సీటు కట్టబెట్టింది.
రెండో జాబితాలో కీలక నేతలు
రెండో జాబితాలో హర్యానా మాజీ సీఎం మనోహర్‌ లాట్‌ ఖట్టర్‌, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అనురాగ్‌ ఠాకూర్‌, పియూష్‌ గోయల్‌, సిట్టింగ్‌ ఎంపీ తేజస్వీ సూర్యలకు బీజేపీ అవకాశం కల్పించింది.
తెలంగాణ అభ్యర్థులు
1. మహబూబ్‌ నగర్‌ – డీకే అరుణ
2. మెదక్‌ – రఘునందన్‌ రావు
3.మహబూబాబాద్‌ (ఎస్టీ) – సీతారాం నాయక్‌
4.నల్లగొండ – సైదిరెడ్డి
5. ఆదిలాబాద్‌ -నగేష్‌
6. పెద్దపల్లి (ఎస్సీ) – గోమస శ్రీనివాస్‌