బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ హటావో..

BJP-RSS Hatao..– అన్నార్తుల వ్యథలను తీర్చలేని దైన్యం
– ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
– అటకెక్కిన ఉజ్వల పథకం
– మోడీ పాలనలో నిరుద్యోగ తాండవ
– ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా..అక్టోబర్‌ 5న ఛలో ఢిల్లీ
– విలేకర్ల సమావేశంలో ఎస్‌ పుణ్యవతి
– దేశంలో మహిళల భధ్రతకు ముప్పు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని మోడీ సర్కార్‌ మహిళా వ్యతిరేక దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నదని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నేత ఎస్‌ పుణ్యవతి విమర్శించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్ష, ఉపాధ్యక్షులు అరుణజ్యోతి, కేఎన్‌ ఆశాలత, బి హైమావతితో కలిసి ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
‘బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ హటావో..మహిళా బచావో’ నినాదంతో వచ్చే నెల 5న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. వేలాది మంది మహిళలు దేశవ్యాప్తంగా మహార్యాలీకి ఇప్పటికే సమాయత్తమవుతున్నట్టు తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ లపై దారుణ మైన హింస కొనసాగు తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రక్షణకోసం పనిచేయాల్సిన చట్టాలు ఉద్దేశ పూర్వకంగానే నీరుగార్చ బడుతున్నాయన్నారు.
పురుషాంకారంతో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డవారు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారనీ, వారికి చట్టాలు దాసోహమంటున్నాయని విమర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు సంఘటితంగా పోరుబాట పట్టాల్సిన అవశ్యకత ఏర్పడిందని తెలిపారు.
మరోపక్క దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయన్నారు. దారిద్య్రాన్ని మరింత పెంచే విధంగా మోడీ పాలనా విధానాలున్నాయన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం అవుతున్నదని చెప్పారు. పేదలకు ఇవ్వాల్సిన సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌ బండలు ఉచితంగా ఇస్తామంటూ నమ్మబలికి..మాట తప్పారడని తెలిపారు. ఉజ్వల పథకానికి ఉద్వాసన పలికి..దాన్ని అటకెక్కించారని విమర్శించారు.
పెరుగుతున్న హింస..
రోజురోజుకు మహిళలపై హింస పెరుగుతున్నదన్నారు. సగటున రోజుకు 56 మంది లైంగిక దాడులకు గురవుతున్నారని తెలిపారు. ఇవన్నీ కేంద్రానికి పట్టకపోవటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మణిపూర్‌ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పలేక మౌనం వహించారని గుర్తు చేశారు.మరో పక్క మహిళలకు ఉపాధి కల్పించటంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఉన్న పనిదినాలు పడిపోతున్నాయన్నారు. ఉపాధి హామీ లాంటి చట్టాన్ని క్రమంగా నీరుగారుస్త్తున్నారని చెప్పారు. నిర్వాసితులు పెరుగుతున్నారనీ, వారి సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్టు కనపడటం లేదన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కాలరాస్తూ అక్కడున్న విలుపైన ఖనిజన సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని చెప్పారు. అందులో భాగమే మణిపూర్‌ మారణహోమం అన్నారు. విద్యా, వైద్యం సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే..వాటిని పరిష్కరించకుండా కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని చెప్పారు. తమ రాజకీయ ప్రయోజనాలకోసం చట్టబద్ద వ్యవస్థలను బలహీనం చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.