బీజేపీ పెద్ద కుటుంబం.. మనస్పర్ధలు కామన్‌

– బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లబోం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ పార్టీ పెద్ద కుటుంబం లాంటిదనీ, చిన్నచిన్న మనస్పర్ధలున్నప్ప టికీ నేతలందరూ కలిసి పనిచేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగా ణలో బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చి ఓట్లపై సమీక్షించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. యువతను పార్టీలోకి పెద్ద ఎత్తున రప్పించేలా ముందుకెళ్తామన్నారు. కొత్త ఓటర్లను కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. మంగళవారం ఆర్గనైజేషన్‌ ఇన్‌చార్జులను ప్రకటిస్తా మని తెలిపారు. సంక్రాంతి తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామ న్నారు. తెలంగా ణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌ -బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనీ, తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో రూపకల్పన కోసం ప్రజల అభిప్రా యాలను తీసుకుం టామని చెప్పారు. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రస్ట్‌ చేసే కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆ కార్యక్రమం 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను రేవంత్‌ సర్కారు ఎందుకు కోరుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీని తట్టుకోలేకనే రాహుల్‌గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయాడని విమర్శించారు. మోడీని మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు.