కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు

– పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్‌, మహేశ్వరం, షాద్‌నగర్‌, ఉప్పల్‌ ప్రాంతాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, బేలా, జైనత్‌, మావాలా మండలాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదన్నారు. ఆయన్ను సీఎం కేసీఆర్‌ చెల్లని రూపాయిగా నిర్ణయించారని ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాను కాంగ్రెస్‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా… అక్కడి ప్రజలకు ఇల్లు రాలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామనీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు. తెలంగాణలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో 8 అసెంబ్లీ స్థానాలను గెలిపించాలనీ, రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మకు జన్మదిన కానుక ఇద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెరిఫికేషన్‌ లేకుండా షెడ్యూల్‌ విడుదల చేస్తారా?
ఎన్నికల షెడ్యూల్‌ మార్చాలి : జి నిరంజన్‌
క్షేత్రస్థాయిలో ఎన్నికల వెరిఫికేషన్‌ లేకుండా షెడ్యూల్‌ ఎలా విడుదల చేస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ మార్చాలని కోరారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం స్పెషల్‌ సమ్మరి డివిజన్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దీని ప్రకారం మే 25 నుంచి జూన్‌ 23 వరకు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్స్‌ ఇంటింటికి తిరిగి ఓటర్‌ జాబితాలో ఉన్న పేర్లు పరిశీలన చేయాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.