రైతుల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

రైతుల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు– ఐదేండ్లు ఎక్కడున్నావ్‌ బండి సంజరు..
– విభజన హామీల అమలు ఏమైంది..! : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
రాష్ట్రంలో పదేండ్ల కాలంలో నష్టపోయిన రైతాంగాన్ని ఏనాడు ఆదుకోని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు నేడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేశారు. వార్డుల్లోని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న బండి సంజరు.. ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు రావడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు రైతుల బాధలు గుర్తుకొస్తున్నాయని ఆరోపించారు. బండి సంజరు రాష్ట్రంలో దీక్ష చేయడం కంటే రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర దీక్ష చేయాలని సూచించారు. వర్షాకాలంలో వర్షాలు పడలేదని, గ్రౌండ్‌ లెవెల్‌ వాటర్‌ పడిపోతున్నాయని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్‌ వల్లే కరువు వచ్చిందన్న వ్యక్తులు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం మొన్నటి దాక రాముడి ఫొటో పెట్టుకుని నరేంద్ర మోడీ ఫొటో బంద్‌ చేశారన్నారు. కాళేశ్వరం మునిగితే, కుంగితే సలహాలు ఇవ్వని కేసీఆర్‌.. పొలాల బాట పట్టారన్నారు. కరువును రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొడుతూ రైతుల పొలాల దగ్గర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్‌తో కలిసొస్తే ప్రధానమంత్రి దగ్గర ప్రకృతి వైపరీత్యం సహకారం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వానికి సహకరించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని తెలిపారు. అనంతరం హుస్నాబాద్‌ పట్టణం ఆరేపల్లిలో ఇటీవల మరణించిన కాశబోయిన ప్రభాకర్‌ కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. ఆయన వెంట సింగిల్‌విండో చైర్మెన్‌ బొలిశెట్టి శివయ్య, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, మండల అధ్యక్షులు బంక చందు, మడప జైపాల్‌ రెడ్డి, చిత్తారి రవీందర్‌ అక్కు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.