– మతోన్మాద, కార్పొరేట్ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత
– మతాన్ని రాజకీయ అస్త్రంగా వాడుతున్న మోడీ
– బీజేపీ చేసిన విధ్వంసానికి ఈ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడాలి
– విపక్షాలను కలుపుకుపోయే బాధ్యత కాంగ్రెస్‌దే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
– జహంగీర్ గెలుపు కోసం లక్ష రూపాయల సహాయం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో బీజేపీని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయబోమని, బీజేపీని ఓడించేందుకు విపక్షాలను కలుపుకుపోయే బాధ్యత కాంగ్రెస్‌దేనని, అలాంటి ప్రయత్నం ఆ పార్టీ నుంచి కనిపించడంలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో చేసిన విధ్వంసానికి ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు తగిన గుణపాఠం నేర్పి చరమగీతం పాడాల్సిన అవసరముందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేసి ఆ స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చి ప్యూడల్ భావజాలం వైపు తీసుకుపోయేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ, భాషా విధ్వేషాలను రెచ్చగొట్టి, మతాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుని ఎన్నికల్లో మోడీ లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావించాల్సిన ప్రధాన మంత్రి రాముని గుడి పేరిట మత భజన చేయడం దుర్మార్గమైన ధోరణి అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలతో కూడిన దేశంగా భారత్ ఉందని, ఇది బ్రిటీష్ కాలం కంటే అధికమైందని ప్రపంచ మేథావులు ఘోషిస్తున్నారన్నారు. వంద కోట్ల మంది భారతీయులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నరంటూ ఐక్య రాజ్య సమితి పేర్కొన్నదంటే మన పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని తెలిపారు. ధరల పెరుగుదల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందన్నారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలు ఐక్యమై ఇండియా కూటమిగా ఏర్పడిందన్నారు. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం అంతంత మాత్రమేనన్నారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కరికి కూడా పట్టాలివ్వలేదన్నారు. పైగా వేసుకున్న గుడిసెల్ని కూల్చి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిఖరంగా నిలబడి పోరాడే సీపీఐ(ఎం) పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ గెలపునకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సంగారెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తరపున జహంగీర్ గెలుపు కోసం లక్ష రూపాయల్ని సహాయంగా అందజేయడం అభినందనీయమన్నారు.
సామాజిక ఉద్యమాలను బలపర్చండి: చుక్క రాములు
సామాజిక ఉద్యమాలను బలపర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. కార్మికోద్యమ నేత బీటీ రణదీవె వర్థంతి ఏప్రిల్ 6 నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, బహుజన, మైనార్టీల సమస్యల్ని పరిష్కరించకుండా కేవలం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీలకు నష్టం చేసేలా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేందుకు కుట్ర చేస్తోందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, బి.మల్లేశం, ఎ.మాణిక్యం, రామచంద్రం, జిల్లా కమిటీ సభ్యులు నర్సింహులు, ఎం.యాదగిరి, యాదవరెడ్డి, ప్రవీణ్‌కుమార్, విద్యాసాగర్, రేవంత్‌కుమార్, మహిపాల్, పాండురంగారెడ్డి నాయకులు నాగేశ్వర్‌రావు, అశోక్, కృష్ణ, రమేష్‌గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.