– ఈటల, రేవంత్, రాజాసింగ్ ఓటమి ఖాయం
– కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌లో కుట్ర : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సహా, బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, రాజాసింగ్ లు ఓడిపోవడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఆటలాడుతున్నాయని విమర్శిచారు. బీజేపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు. ఆయన ఎంత ఎక్కువగా మాట్లాడితే బీఆర్‌ఎస్‌కు అంత లాభమని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్‌లో కుట్ర ఉందనీ, బీసీ, మైనార్టీల మధ్య పంచాయతీ పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
మైనార్టీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. మైనార్టీల కులగణన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వారిని బీసీల్లో చేరిస్తే మైనార్టీలకు అందించే సంక్షేమం ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ మంత్రిత్వశాఖ, కార్పొరేషన్, ప్రత్యేక హౌదా కోల్పోతారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారి కోసం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఆ కాలంలో వారి సంక్షేమానికి హస్తం పార్టీ రూ.930 కోట్లు కేటాయిస్తే, గత పదేండ్లలో బీఆర్‌ఎస్ రూ.10 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. జనాభా గణన చేయాలంటే బీసీల లెక్కలు ముందు తేల్చాలనీ, బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.