‘పేదలకు విద్యను దూరం చేసేందుకు బీజేపీ కుట్రలు’

– విద్యార్థి మార్చ్‌లో బాలాపూర్‌ ప్రగతిశీల యువజన సంఘం నాయకులు
నవతెలంగాణ – బడంగ్‌పేట్‌
పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం పలు రకాల కుట్రలు చేస్తుందని బాలాపూర్‌ ప్రగతిశీల యువజన సంఘం పీవై ఎల్‌ నాయకులు ఆరోపించారు. వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నీట్‌ పరీక్షలలో జరిగిన అవకతవకలపై హిమాయత్‌ నగర్‌ నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు మంగళవారం విద్యార్థి మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కారమోల రాకేష్‌, కొల్లూరు భీమేష్‌ మాట్లాడుతూ..పేద విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్షలు రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి, నీట్‌ అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేపర్‌ లీక్‌ పై ప్రధాని మోడీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేసి నీట్‌ నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, తదితర బీజేపీ పాలిత ప్రాంతాలలోనే ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వీటిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్‌ వ్యవహారంపై ప్రధాని మౌనం విడాలన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధర్మంగా వ్యవహరిస్తున్నారని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి హేతుబద్ధత లేదని దాన్ని బోర్డులో ఎవరున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీట్‌లో బీజేపీ చేసిన కుట్రతో లక్షలాది మంది విద్యార్థులు తమ జీవితాలను నష్టపోయారని ఆరోపించారు. విద్యారంగం పట్ల మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఉంటున్న బీజేపీ విద్యను కాషాయీకరణ వైపు తిప్పాలని ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు, కొల్లూర్‌ శంకర్‌, జి మహేష్‌, పి నరేష్‌, ఎన్‌ మహేష్‌, ప్రవీణ్‌, పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.