గిరిజన తెగల మధ్య ఘర్షణలకు బీజేపీ కుట్ర

BJP conspiracy for clashes between tribals–  ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాలను జయప్రదం చేయాలి
–  గిరిజన వ్యతిరేక విధానాలపై 9 నుంచి14 వరకు నిరసనలు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
గిరిజన తెగల మధ్య ఘర్షణలు పెట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరామ్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సోమవారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వాల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తోందని విమర్శించారు. మణిపూర్‌ లో గిరిజనుల హక్కులను కాలరాసి గిరిజనేతర ప్రజలకు హక్కులు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే అల్లర్లను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన తెగలను చంపుతూ, మహిళలను నగంగా ఊరేగించి సామూహిక లైంగికదాడులు జరుగు తున్నా పట్టించుకోకుండా మారణ హోమం సష్టిస్తోం దని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లాగానే తెలంగాణలో కూడా గిరిజన తెగల మధ్య వివాదాల కోసం బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. అందుకు ఆ పార్టీ ఎంపీ సోయం బాబురావు వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. ఒకవైపు గిరిజన తెగల మధ్య ఘర్షణలు రేపుతూనే మరోవైపు వాల్మీకి బోయ వంటి 11 ఓబీసీ కులాలను గిరిజన జాబితాలో కలిపేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించ డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. భారత రాజ్యాంగం షెడ్యూల్‌ ప్రాంతాల్లో గిరిజనులకు కల్పించిన ఆర్టికల్‌ 371 (ఏ) నుంచి (హెచ్‌) వరకు, 1/70, పెసా వంటి చట్టాలతో పాటు సంస్కృతి, ఆచారాలను రద్దు చేయడానికే యూని ఫామ్‌ సివిల్‌ కోడ్‌ లాంటి చట్టం తీసుకొస్తున్నదని ఆరోపించారు. అడవులు, అటవీ సంపదను అంబానీ, అదానీలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో అటవీ సంరక్షణ నియమాల బిల్లును చట్టంగా ఆమోదించిందని విమర్శించారు. రాష్ట్రంలో నూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. పోడు భూముల పంపిణీలో అర్హులైన గిరిజనులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి చెప్పిన విధంగా 11 లక్షల ఎకరాలపై హక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ధర్మ నాయక్‌, నగర నాయకులు గోపీ నాయక్‌, బాలు, పాండు, రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.