రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర

– ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే ప్రయత్నాలు : ఆప్‌ మంత్రి అతిశి ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చి, రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆప్‌ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆప్‌ మంత్రి అతిశి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తమకు తెలిసిందన్నారు. ”ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించటం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావటం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)ని పదవి నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది” అని ఆమె అన్నారు. లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్‌ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కారు కేంద్ర ఏజెన్సీ సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నదనీ, ప్రతిపక్ష నేతలను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపిస్తున్నారు.