బీజేపీ డౌన్‌ఫాల్‌ షురూ…

– అందుకే జమిలి ఎన్నికల అస్త్రం
– ‘ఇండియా’ కూటమికి పెరుగుతున్న ఆదరణే కారణం
– కేంద్రం వేసిన కమిటీ ఓ బోగస్‌
– బీజేపీని గెలిపించటమే బీఆర్‌ఎస్‌, ఎంఐఎం లక్ష్యం : సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశ వ్యాప్తంగా బీజేపీ డౌన్‌ ఫాల్‌మొదలైందనీ, మళ్లీ బతికేందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది.”ఇండియా కూటమి”కి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణతో బీజేపీకి గుబులు పట్టుకున్నదనీ, అందుకే ఆ పార్టీ ముందస్తుగా జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నర్సింహతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో నారాయణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిలో నిర్వహించిన ‘ఇండియా కూటమి’ సమావేశం ప్రభావంతోనే ప్రధాని మోడీ ‘ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని ‘ ఏర్పాటు చేశారన్నారు. మూడో ఫ్రంట్‌ పేరుతో బీఆర్‌ఎస్‌, జాతీయ స్థాయిలో ఎంఐఎం మరోసారి బీజేపీని గెలిపించేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతోనే బీజేపీకి కేసీఆర్‌ అనుకూలంగా మారారని చెప్పారు. జమిలీ ఎన్నికల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఒక బోగస్‌ అని కొట్టిపారేశారు. ఈ కమిటీలో ఉన్న సభ్యులు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఏది చెబితే అదే చేస్తారనీ, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారనీ, అలాంటి కమిటీకి దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ సహాయ నిరాకరణ చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కోవింద్‌కు ఏ మాత్రం విజ్ఞత ఉన్నా.. అవమానకరమైన ఈ కమిటీకి నాయకత్వ బాధ్యతను తిరస్కరించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ మొదలు అన్ని వ్యవస్థలూ కుప్పకూలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలకు పార్లమెంట్‌, ఇతర అసెంబ్లీలో 2/3 వంతు మద్దతు ఉండాలనీ, కానీ అధికారంలో ఉన్న బీజేపీ ఇందుకు భిన్నంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. జమిలి ఎన్నికల అంశంపై కనీసం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం దారుణమన్నారు. జమిలి ఎన్నికలను బీఆర్‌ఎస్‌, వైసీపీ,టీడీపీ ఖండించకపోతే ఆ పార్టీలు బీజేపీకి సానుకూలంగా ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. మణిపూర్‌ మంటలను కేంద్రంలోని బీజేపీ ప్రొత్సహిస్తున్నదనీ, అక్కడి సీఎం విధ్వసంకారులకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇస్రో ప్రయత్నాలకు కూడా ప్రధాని మోడీ మతం రంగు పులిమేందుకు చూస్తున్నారన్నారని చెప్పారు. బీజేపీకి సేవ చేసేందుకే ఎంఐఎం కృషి చేస్తున్నదనీ, బీజేపీి, ఎంఐఎంలది లివింగ్‌ టు గెదర్‌ అని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం పావులు కదుపుతున్నదన్నారు. తాజాగా కేసీఆర్‌ కూడా వారి భుజమెక్కారన్నారు. ఎంఐఎం నేతల ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తే అనేక కోట్ల అక్రమ సంపాదన వెలుగులోకి వస్తుందన్నారు. వై.ఎస్‌. జగన్‌ తన కేసుల నుండి తప్పించుకునేందుకు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పట్ల కేసీఆర్‌ తన నాభి నుంచి కాకుండా నాలుకతో మాట్లాడుతున్నారన్నారనీ, అందువల్లనే తాము బీఆర్‌ఎస్‌కు దూరమయ్యామని ఒక ప్రశ్నకు సమాధానంగా నారాయణ బదులిచ్చారు.