– రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మర్కుక్/జగదేవపూర్
ఎన్నికల్లో బీజేపీ డకౌట్ అవుతుంది.. కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవని మంత్రి హరిశ్‌రావు అన్నారు. శుక్రవారం మర్కుక్, జగదేవపూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు. బీఅర్‌ఎస్‌పై బూతులు మాట్లాడుతున్న వాళ్ళకు 30న పోలింగ్ బూత్‌లలో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి బుద్ది చెప్పాలన్నారు. బీజేపీి, కాంగ్రెస్ వాళ్లను గెలిపిస్తే సీఎం కేసీఆర్ హయాంలో వేసిన రోడ్లు, నిర్మించిన భవనాలకు రంగులేయడానికి కూడా పనికిరారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో సౌభాగ్యలకిë పథకం ద్వారా అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది రైతులకు బీమా పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. కరోనా కష్టకాలంలో మీ వెంట నడిచిన నాయకులు గులాబీ నాయకులని చెప్పారు. ఏ ఒక్క నాయకుడూ ప్రజలను పలకరించిన పాపాన పోలేదని, ఎన్నికలు రాగానే వచ్చి హామీలు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ భూంరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.