– నివారించదగ్గ జబ్బులను పట్టించుకోని వైనం
– పూర్తిస్థాయి వ్యాక్సిన్లకు నోచుకోని పేద పిల్లలు
– జీవితకాలం రోగాల బారిన పడుతున్న ప్రజలు
– గర్భాశయ క్యాన్సర్‌తో ఎనిమిది నిమిషాలకో మహిళ మరణం
– నిపుణుల మాటలను పెడచెవిన పెట్టిన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సబ్ కా సాత్ … సబ్ కా వికాస్ వినడానికి చెవులకు ఇంపుగా వినిపించే నినాదం. కానీ అమల్లో మాత్రం అందరితో…అందరి వికాసం వట్టి మాటగా తేలిపోతున్నది. పిల్లలకు భవిష్యత్తులో రోగాలు రాకుండా కాపాడే వ్యాక్సిన్లను కూడా పూర్తిగా జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో చేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మారుస్తున్నామని పదే పదే ప్రగల్భాలు పలికే నేతలు కనీసం దేశంలోని చిన్నారులంతా వ్యాక్సిన్లను వేసుకునే దిశగా కూడా అడుగులు వేయడం లేదు. దేశంలో పేద పిల్లలు, ప్రజలు తరచూ నివారించదగ్గ జబ్బుల బారిన పడి యాతనకు గురవుతున్నారు. అలాంటి జబ్బులను కూడా సకాలంలో గుర్తించి చికిత్స అందించకుండా ఆలస్యం చేస్తే అకాల మరణాలు తప్పవు. ఉదాహరణకు నివారించదగ్గ జబ్బు అయిన గర్భాశయ క్యాన్సర్ వంటి వాటిన పడి దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ప్రాణాలు విడుస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలు, సోషలిస్టు దేశాలు తమ జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో అన్ని వ్యాక్సిన్లను చేర్చడం ద్వారా మరణాలను తగ్గించిన అనుభవాలు కళ్లెదుట కనిపిస్తున్నా… కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అది ప్రాధాన్యతాంశంగా కనిపించడం లేదు. దేశంలోని పీడియాట్రిషి యన్లు (చిన్న పిల్లల వైద్యనిపుణులు), ప్రజారోగ్య ఉద్యమకారులు పదే పదే మొత్తకుంటున్నా కేంద్రం చెవికెక్కడం లేదు. కేంద్ర సర్కార్ ఏ మాత్రం సహకరించకపోవడంతో తరచూ వస్తున్న జబ్బులను గుర్తిస్తూ ఆయా రాష్ట్రాలు కొంత మేర అదనపు వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో న్యూమకోకల్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. గవద బిళ్లల (మమ్స్)కు వ్యాక్సిన్ ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కేంద్రం ఆమోదించకపోవడంతో పేద పిల్లలు దానికీ నోచుకోలేదు. క్యాన్సర్‌తో మరణిస్తున్న వారిలో గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్న వారు రెండో స్థానంలో ఉన్నారు. ఇది రాకుండా తొమ్మిదేండ్ల నుంచి 14 ఏండ్లలోపు బాలికలకు రెండు డోసులు హెపీవీ టీకా ఇవ్వాలని క్యాన్సర్ నిపుణులు, పీడియాట్రిషియన్లు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మెనింగోకోకల్ వ్యాక్సిన్ వేసుకోకుంటే తీవ్రమైన జ్వరం, ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లి ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. మెదడుకు సంబంధించిన ఈ వ్యాధిని కూడా వ్యాక్సిన్ తో నివారించే అవకాశముంది. వీటికి తోడు తరచూ సీజనల్ వ్యాధులుగా చెప్పే టైఫాయిడ్, ఫ్లూ, చికెన్ ఫాక్స్ (ఆటలమ్మ), హెపటైటీస్ ఏ (కామెర్లు) తదితర వ్యాధులను కూడా వ్యాక్సిన్‌తో నివారించే అవకాశముంది. అవగాహన కలిగిన ధనవంతుల పిల్లలు ప్రయివేటులో అన్ని వ్యాక్సిన్లను వేసుకుంటున్నా…. దేశంలో మెజార్టీగా ఉన్న పేదలకు మాత్రం అవి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఇప్పటికే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ (ఐఏపీ)తో పాటు ఆంకాలజిస్టులు కేంద్రానికి పలుమార్లు వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధుల తీవ్రత, మరణాలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా కూడా లేకపోవడం కేంద్రం నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది. బడ్జెట్ లేదంటూ సాకులు చెపుతూ పేదల ఆరోగ్యంతో కేంద్రం చెలగాటమాడుతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం లాంటి దేశాల్లో నేషనల్ ఇమ్యూనైజేషన్‌లో ఎక్కువ వ్యాక్సిన్లను వేయడం ద్వారా ఆయా రోగాలు, మరణాలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దేశాలు జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని విస్తతం చేయాలని సూచిస్తున్నది. ఇప్పటికైనా పేదలకు అన్ని రకాల వ్యాక్సిన్లను ఇమ్యూనైజేషన్‌లో భాగంగా వేయాలని ఐఏపీ నాయకులు కోరుతున్నారు.
పేదలే ఎక్కువ :డాక్టర్ కె.పవన్ కుమార్
గవద బిళ్లలు తదితర వ్యాధులతో వచ్చే వారిలో పేద పిల్లలే ఎక్కువగా ఉంటున్నారని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషిన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.పవన్ కుమార్ తెలిపారు. జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో ఇలాంటి వాటికి వ్యాక్సిన్ లేకపోవడం దీనికి కారణమన్నారు. ఇప్పటికే తమ జాతీయ నాయకత్వం కేంద్రానికి విన్నవించిందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు.