
– నిరసనలకు మద్దుతుగా దీక్షలో నాయకులు
నవతెలంగాణ-మంగపేట : బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నదని బీజేపీ మండల పార్టీ అద్యక్షుడు లోడె శ్రీనివాస్ గౌడు అన్నారు. శనివారం 17 రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల నిరసన దీక్షలకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపి శిబిరంలో బైఠాయించారు. శ్రీనివాస్ గౌడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోవడం అన్యాయమని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రోజంతా కష్టం చేస్తూ గ్రామాలను పరిశుభ్రం చేస్తూ చాలీచాలని వేతనంతో కుటుంబాలు పోశించుకుంటున్నారని వారిని ప్రభుత్వం గుర్తించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి రాగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమ బద్ధీకరణ చేస్తామని మాయమాటలు చెప్పిన కేసీఆర్ మాటమీద నిలబడి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్లను సహాయ కార్యదర్శులుగా పదోన్నతి అవకాశం కల్పించి ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి 10 లక్షల పరిహారాన్ని చెల్లించాలని, మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని, మిగతా ఉద్యోగులకు సెలవులు ఇచ్చినట్టుగా వీరికి కూడా వేతనంతో కూడిన సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామిడి సురేష్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి లొంక రాజు, మండల దళిత మోర్చా అధ్యక్షుడు రామటెంకి సమ్మయ్య, మండల సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి కుమారస్వామిలు పాల్గొన్నారు.