రైతులకు శాపంగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు

సీఐటీయూ సీఐటీయూ– మోడీ నియంత పోకడలతో కార్మికులు, కూలీలకు రక్షణ కరవు
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ యాకూబ్
నవతెలంగాణ – పెద్దవంగర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు శాపంగా మారాయని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ యాకూబ్, ఏఐటీయూసీ నాయకులు బందు మహేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో సీఐటీయూ ఏఐటీయుసీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంత నిర్ణయాలతో రైతులు, కార్మికులు, కూలీలకు రక్షణ కరువైందని,  ప్రజాధనాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ బడుగు బలహీన వర్గాల పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మెడలు వచ్చేందుకు అసంఘటిత కార్మికులంతా ఏకమై విడతల వారి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఆ చట్టాల వల్ల కార్పొరేటర్ల ధనాన్ని కట్టబెడుతూ, ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు కార్మిక, కూలీ సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచి, పేదల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
         అన్నం పెట్టే రైతన్నలకు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను వ్యవసాయానికి దూరం చేసే కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు కార్మికులు, కర్షకులు, ప్రజాతంత్ర వాదులు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, డ్రైవర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, అన్ని కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాలు, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని, మన హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా బాధ్యులు సురేష్ బాబు, సిఐటియూ మండల కన్వీనర్ రాపోలు వీరన్న, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు పసుల స్వరూప, సిఐటియు జిల్లా నాయకులు మార్క సాంబయ్యా, లక్ష్మి మంజుల, సాంబలక్ష్మి, రేణుక, తడకమల్ల ఎల్లయ్య, మడిపెద్ది నరేష్, కుమార్, పాక శీను, పిట్టల రాములు, మహేందర్, వెంకట్ నారాయణ, సోమేష్, యాకయ్య, మల్లేష్, కొండ సంపత్, మహేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.