మత రాజకీయాలకు తెరలేపిన బీజేపీ

– పార్లమెంట్‌ ఎన్నికల కోసమే అయోధ్య రామమందిరం
– కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలి
– ఫిబ్రవరి 16న అఖిల భారత సమ్మెను జయప్రదం చేయండి
– సిఐటియు మెదక్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.మల్లేశం
నవతెలంగాణ – మెదక్‌
పార్లమెంట్‌ ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు తెరలేపిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.మల్లేశం పేర్కొన్నారు. శనివారం మెదక్‌ కేవల్‌ కిషన్‌ భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసమే బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. నిర్మాణం పూర్తి కాకుండానే విగ్రహ ప్రతిష్ట చేయడం సరికాదని పీఠాధిపతులు సూచించినా పట్టించుకోలేదన్నారు. అక్షింతల పేరుతో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను మతం మత్తులో ముంచుతుందని మండిపడ్డారు. దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి. బస్వరాజు, అధ్యక్షులు మహేందర్‌ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ, జిల్లా నాయకులు కడారి నాగరాజు, బాలేష్‌, వెంకటరామిరెడ్డి, బాలనర్సు, పుష్ప, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.