ఏదో రకంగా ఎన్నికల్లో గెలవడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీ లక్ష్యం. దాని కోసం ప్రజలను చీల్చడానికి, వారి మధ్య ఘర్షణలు సృష్టించడానికి కూడా ఆ పార్టీ వెనకాడదన్నది ఇప్పటికే నిరూపితమైన సత్యం! మెజార్టీ ప్రజలను ఆకట్టుకోవడానికి ఒకవైపు తీవ్ర హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తూ, క్షేత్ర స్థాయిలో అవసరాలను బట్టి మనువాదాన్ని, కులతత్వాన్ని ఆశ్రయిస్తుంది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలతో పాటు, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆ విద్వేష విషవ్యూహాన్నే జార్ఖండ్ ఎన్నికల్లో సైతం బీజేపీ అనుసరిస్తోంది. రాష్ట్ర జనాభాలో 26శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉన్న గిరిజనుల ఓట్లను గంపగుత్తుగా దండుకోవడమే లక్ష్యంగా బీజేపీ నేతల ఈ విష ప్రచారం సాగుతోంది. ఈ రాష్ట్రంలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు అయ్యాయంటే ఆదివాసీ ఓట్ల ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అప్పటి నుండి ఈ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మైనార్టీలను ప్రత్యేకించి ముస్లింలను బూచిగా చూపి గిరిజనుల్లో భయోత్పాతాలను రెచ్చగొట్టే యత్నాలు చేస్తోంది. బంగ్లాదేశ్ నుండి పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయని, దీని కారణంగా ఆదివాసీల భూములు, వనరులు ప్రమాదంలో పడతాయన్న ప్రచారాన్ని కొన్ని సంవత్స రాలుగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడంతో హైకోర్టు జోక్యం చేసుకుని ఈ ప్రచారంలోని నిజానిజాలను తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ విచారణ కొనసాగుతోంది. అయినా ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముస్లింలను చొరబాటుదారులుగా చిత్రీకరించడంతో పాటు వారు గిరిజనుల ఆహారాన్ని, కుమార్తెలను అపహరిస్తున్నారని చెప్పారు. దేశ ప్రధాని ఇలా మాట్లాడటం ఎంత దిగజారుడుతనం? ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న కపట వ్యూహం తప్ప దీనిలో మరేదైనా ఉందా? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? హోంమంత్రి అమిత్‌షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్‌లతో పాటు పలువురు ఇతర నాయకులదీ విద్వేషపు బాటే! ఇంతమంది, ఇంత బహిరంగంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా ఘనత వహించిన ఎన్నికల కమిషన్‌కు మాత్రం ఇవేమి పట్టడం లేదు. సుమోటోగా తీసుకోవాలని ఈసికి ఫిర్యాదులు అందినా మౌనంగా ఉండటం దిగ్భ్రాంతికరం.
ఎన్నికల వేళ ఏకరూప పౌరస్మృతి (యునిఫాం సివిల్ కోడ్-యుసిసి)ని బీజేపీ తెరమీదకు తీసుకురావడం మరింత వివాదాస్పదంగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా విడుదలచేసిన ‘సంకల్ప పత్ర’లో తాము గెలిస్తే రాష్ట్రంలో యుసిసిని అమలు చేస్తామని, అయితే, దాని నుండి గిరిజనులను మినహాయిస్తామని బీజేపీ పేర్కొంది. ‘ఒకే దేశం..ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, ఆ పార్టీ నేతలందరూ ఊదరగొడుతుండగా, జార్ఖండ్‌లో యుసిసి నుండి గిరిజనులను మినహాయిస్తామని చెప్పడం బీజేపీ కపట నాటకాన్ని బయటపెడుతోంది. ప్రజలను కులం, మతం ప్రాతిపదిక విభజించి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలన్న బీజేపీ ఆలోచన ధోరణికి ఈ ప్రకటన నిలువెత్తు నిదర్శనం. సమాజంలో అన్ని విధాలుగా వెనకబడి, తమవైన సొంత సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్న గిరిజనులకు యుసిసి నుండి ఇటువంటి మినహాయింపు ఇవ్వాల్సిందే! జార్ఖండ్‌లోని గిరిజనులకే కాదు, దేశమంతా ఇటువంటి విభిన్న సాంప్రదా యాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. అందులోనూ సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనం, విభిన్న తెగల ఆచారాలు, సంస్కృతులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఏకరూప పౌరస్మృతిని రుద్దడం సరికాదు. సున్నితమైన ఇటువంటి అంశాన్ని రాజకీయ స్వప్రయోజ నాల కోసం వాడు కోవడం బీజేపీ దివాళాకోరుతనానికి నిదర్శ నం. చైతన్యవంత మైన జార్ఖండ్ ప్రజలు, ముఖ్యంగా దళితులు, మహిళలు, మైనార్టీలు, గిరిజనులు ఈ కుతంత్రాలను అర్ధం చేసుకుని సమిష్టిగా తిప్పికొడతారని ఆశిద్దాం.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్