ఆస్తుల్లో బీజేపీ… అప్పుల్లో కాంగ్రెస్‌

BJP in assets... Congress in debt– కొండలా పెరుగుతున్న కమల దళం ఆస్తులు
– అప్పులు మాత్రం ఐదు కోట్లేనట
న్యూఢిల్లీ : బీజేపీ ఆస్తుల విలువ ప్రతి ఏటా కొండలా పెరిగిపోతోంది. మరే ఇతర జాతీయ పార్టీకీ అందనంత దూరంలో నిలిచింది. 2021-22వ సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల విలువతో పోలిస్తే బీజేపీ ఆస్తుల విలువ ఏకంగా ఏడున్నర రెట్లు ఎక్కువ. గత సంవత్సరం బీజేపీ తన ఆస్తుల విలువను రూ.6,046.81 కోట్లుగా ప్రకటించింది. ఆ ఏడాది కాంగ్రెస్‌ ఆస్తుల విలువ రూ.805.68 కోట్లు మాత్రమే.
ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఐ (ఎం), తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు ప్రకటించిన ఆస్తులు, అప్పుల వివరాలను ఈ సంఘం విశ్లేషించింది. 2020-21లో బీజేపీ ఆస్తుల విలువ రూ.4,990 కోట్లు కాగా గత సంవత్సరం ఆ విలువ 21.17% పెరిగింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల విలువ 2020-21లో రూ.691.11 కోట్లు కాగా గత ఏడాది 16.58% పెరిగింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఆ పార్టీకి 2020-21లో రూ.182 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా 2021-22లో ఒకేసారి 151.70% పెరిగి రూ.458.10 కోట్లకు చేరింది.
ఇతర జాతీయ పార్టీల ఆస్తుల విలువ పెరుగుతుంటే బీఎస్పీ ఆస్తుల విలువ మాత్రం తగ్గుతోంది. 2020-21లో ఆ పార్టీ ఆస్తుల విలువ రూ.732.79 కోట్లు కాగా గత ఏడాది రూ.690.71 కోట్లకు తగ్గిపోయింది. ఎనిమిది జాతీయ పార్టీల ఆస్తుల విలువ కలిపి 2020-21లో రూ.7,297.618 కోట్లు ఉండగా గత సంవత్సరం రూ.8,829.158 కోట్లకు పెరిగింది. అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉంది. 2021-22లో ఆ పార్టీ తన అప్పులను రూ.41.95 కోట్లుగా చూపింది. అదే కాలంలో బీజేపీ అప్పులు కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే. ఎనిమిది జాతీయ పార్టీలకూ కలిపి గత సంవత్సరంలో రూ.62.67 కోట్ల అప్పులు ఉన్నాయి.
సంస్కరణల సంఘం సూచనలు
ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీల నుండి తీసుకున్న రుణాల వివరాలను ప్రకటించాలంటూ భారత ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల సంస్థ జాతీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. 1951వ సంవత్సరపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్‌ 78-ఏను ప్రవేశపెట్టాలని, ఖాతాలు సరిగా నిర్వహించని రాజకీయ పార్టీలకు జరిమానాలు విధించాలని 170వ లా కమిషన్‌ నివేదిక సిఫారసు చేసిందని గుర్తు చేసింది. ఈ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించింది. కాగ్‌ ప్యానల్‌లోని అర్హత కలిగిన, ప్రాక్టీస్‌ చేస్తున్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్లతో రాజకీయ పార్టీల ఖాతాలను ఆడిట్‌్‌ చేయించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమంత తామే ఛార్టర్డ్‌ అకౌంటెంట్లను నియమించుకుంటూ ఖాతాలు ఆడిట్‌ చేయించుకుంటున్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది.