– రిజర్వేషన్లను రద్దు చేయబోమని పదేపదే వివరణలు
– రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు
– ఓబీసీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఆందోళన
న్యూఢిల్లీ : బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే చెప్పారు. పార్టీపై ముప్పేట దాడి పెరగడంతో ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు డిఫెన్స్‌లో పడి పదేపదే వివరణలు ఇచ్చుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ నెల 25న ‘ది హిందూ’ పత్రిక ప్రతినిధితో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ‘రిజర్వేషన్లకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదు. రిజర్వేషన్లు అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరమున్నదని కూడా మేము ఎప్పుడూ భావించలేదు’ అని తెలిపారు. ఈ నెల 23న మహారాష్ట్రలోని అకోలాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రిజర్వేషన్లపై పెదవి విప్పాల్సి వచ్చింది. ‘బీజేపీ అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావు’ అని నమ్మబలికారు.
రిజర్వేషన్లను రద్దు చేయడం కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ఆలోచనలపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగడంతో ఆ పార్టీ నాయకులు వరుసగా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే కేవలం అగ్రవర్ణాల ఓట్లతోనే బీజేపీకి గెలుపు సాధ్యం కాదు. 2009 నుండి బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి ఓబీసీ ఓట్లే కారణం.
వీరు కూడా…
కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతి మీర్థా ఈ నెల 2వ తేదీన ఓ బహిరంగ సభలో తేనెతుట్టెను మరోసారి కదిల్చారు. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే తమ పార్టీకి భారీ మెజారిటీ అవసరమని ఆమె చెప్పారు. మీర్థాపై కాంగ్రెస్ విమర్శలు సంధించడంతో ఆమె మౌనం వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన లల్లూ సింగ్ కూడా నూతన రాజ్యాంగంపై మాట్లాడారు. ఆయన అయోధ్య శాసనసభ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించాలన్నా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని లల్లూ సింగ్ అన్నారు. మిల్కీపూర్ శాసనసభ నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గత రెండు నెలల కాలంలో రాజ్యాంగంపై మాట్లాడిన నాయకుల్లో ఆయన మూడో వారు.
రాజ్యాంగంలో ఇప్పటికే అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటిలో ఎలాంటి ప్రమాదము లేదని మీరట్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న అరుణ్ గోవిల్ ఈ నెల 15న చేసిన వ్యాఖ్యకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మార్పు అనేది అభివృద్ధికి సూచిక అని, అది తప్పేమీ కాదని కూడా ఆయన చెప్పారు.
ఆది నుంచీ అదే వైఖరి
రాజ్యాంగం పైన, రిజర్వేషన్ల పైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ట్రాక్ రికార్డును ఓసారి పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2015లో ‘పాంచజన్య’ పత్రికలో స్పష్టం చేశారు.ఇప్పుడేమో మేం రిజర్వేషన్‌లకు వ్యతిరేకం కాదు అంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబోం అంటున్నారు. ఇదంతా కేవలం ఎన్నికల కోసమే. రాజ్యాంగంలో భారతీయత లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక పాంచజన్య 1949లోనే ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓట్లు రాలవేమోనని…
2009 ఎన్నికల్లో ఓబీసీ ఓట్లలో బీజేపీ 17 శాతం వాటాను పొందింది. 2019 నాటికి అది 47 శాతానికి పెరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తే ఓబీసీ ఓటు బ్యాంకుకు గండి పడుతుంది. అందుకే రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని బీజేపీ నేతలు ముక్తాయింపు ఇస్తున్నారు.
వివాదానికి ఆద్యుడు ఆయనే
రాజ్యాంగాన్ని మార్చాలంటే 400కు పైగా స్థానాలు పొందాల్సి ఉంటుందని బీజేపీ నేతలు నిన్న మొన్నటి వరకూ చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి నుంచి ఆ మాటే రావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మద్దతుదారుల్లో నిరసన వ్యక్తం కావడమే దీనికి కారణం. అసలు ఈ వివాదానికంతటికీ కారణం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్ వివేక్ దేవ్‌రారు. గత సంవత్సరం ఆగస్టు 14న ఆయన ఓ వార్తాపత్రికలో వ్యాసం రాస్తూ నూతన రాజ్యాంగం ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై వివాదం చెలరేగడంతో ప్రధాని ఆర్థిక సలహా మండలి వివరణ ఇచ్చుకుంది. రాజ్యాంగాన్ని మార్చాలన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దేవ్‌రారు బాటలో హెగ్డే
సాక్షాత్తూ మోడీ నియమించిన వ్యక్తే రాజ్యాంగాన్ని మార్చాలని సూచించడం వివాదాస్పదమైంది. అది కొనసాగుతుండగానే ఈ ఏడాది మార్చి 11న కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఓ ప్రకటన చేస్తూ రాజ్యాంగాన్ని మార్చడానికే 400 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. హెగ్డే సంఫ్‌ుకు సన్నిహితుడు. అధికారి అయిన దేవ్‌రారుతో పాటు సంఫ్‌ు వ్యక్తి హెగ్డే కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అభిప్రాయపడిన నేపథ్యంలో అందుకు బీజేపీ ఆమోదముద్ర ఉందన్న విషయం బహిర్గతమైంది. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు హెగ్డేకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ ఆయన ప్రసంగ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.