– జీఎస్టీ తెచ్చి నిత్యావసర ధరలు పెంచింది
– అదానీ, అంబానీలను కుబేరులు చేసింది
– కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం : ఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ – చందుర్తి
బీజేపీ కార్పొరేట్ కొమ్ముకాస్తూ అదానీ, అంబానీలను కుబేరులను చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు తిట్లు, దేవుని మీద ఓట్లు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు మార్పు కోసం ఆశ పడ్డారని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ సక్రమంగా ఉండేదని, కేసీఆర్ కిట్టు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఒక్కటీ రాకుండా చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు బాండ్లు బౌన్స్ అయ్యాయని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారని, ఈ నాలుగు నెలల్లో ఎంతమంది మహిళలకు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ సిలిండర్ ధర పెంచిందని, బీడీ కట్టపై పుర్రె గుర్తు తెచ్చి బీడీ కార్మికుల పొట్టకొట్టి ఉపాధి లేకుండా చేసిందన్నారు. కేంద్రంలో మన సమస్యలపై పోరాడాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బోయినిపల్లి వినోద్ కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మళ్లీ అబద్ధాల కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చలిమెడ లక్ష్మి నరసింహరావు, జెడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, తుల ఉమ, ఏనుగు మనోహర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
సభకు వచ్చిన మహిళకు రోడ్డు ప్రమాదం..
బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభకు వచ్చిన మహిళకు రోడ్ ప్రమాదంలో కాలు విరిగింది. సభ ముగియగానే ఒక్కసారిగా జనం గుంపులుగా రోడ్డు దాటుతుండగా కోరుట్ల నుంచి వేములవాడకు వెళ్తుండగా ఎన్‌గల్ గ్రామానికి చెందిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను నాయకులు ఓ ప్రయివేట్ వాహనంలో వేములవాడ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.