కోడ్‌ను ఉల్లంఘిస్తున్న బీజేపీ

– ఈసీకి సీపీఐ (ఎం) ఫిర్యాదు
అగర్తల : త్రిపురలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికార బీజేపీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని సీపీఐ (ఎం) ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని ధన్‌పూర్‌, బాక్సానగర్‌ శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు ఎన్నికల కార్యాలయానికి వెళుతుండగా అధికారులు తమ ప్రదర్శనను అడ్డుకున్నారని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ప్రదర్శనకు అనుమతి లేదని ఎన్నికల అధికారులు తెలిపారని, అయితే అదే ప్రాంతంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే ఎవరూ నిరోధించలేదని ఆయన చెప్పారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిని అదుపు చేయడంలో అధికారులు విఫలమైతే మొత్తం ఎన్నికల ప్రక్రియే అపహాస్యం పాలవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి పునీత్‌ అగర్వాల్‌కు రాసిన లేఖలో చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించినప్పటికీ ఆంక్షలు అమలులో ఉన్న ప్రదేశంలో ప్రసంగించకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, బీజేపీ నేతలను అడ్డుకునేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రభుత్వ ప్రచార సామగ్రిని తొలగించాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని కూడా ఆయన పట్టించుకోలేదని వివరించారు.
‘బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రస్తుతిస్తూ ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్లు, కటౌట్లు, ఇతర సామగ్రిని తొలగించాల్సిందిగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మేము అధికారులను కోరాము.
కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని చౌదరి తన ఫిర్యాదులో తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిన అధికార పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమని అంటూ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.