నవతెలంగాణ – భువనగిరి
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తూ, దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బ తీస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ పిలుపునిచ్చారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్‌ఎన్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా కమిటీ సభ్యులు సిరిపంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు ఉంటేనే అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుందని, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఈ ఐక్యతను దెబ్బతీయడానికి మోడీ, బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేండ్ల కాలంలో దళితులు, గిరిజనులు, మహిళలు అనేక దాడులకు గురవుతున్నారన్నారు. ధరలు విపరీతంగా పెరిగి నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలు కొని తినే పరిస్థితిలో లేకుండా పోయిందని చెప్పారు. రోజు రోజుకూ ఆకలి దారిద్య్రం పెరిగిపోతోందని, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధత చేసిందన్నారు. అవినీతి చేసిన వారు బీజేపీలో చేరితే నీతిమంతులు అవుతున్నారని.. ఇది ఎలా సరైందని ప్రశ్నించారు. మరో పక్క ప్రశ్నించే వారిని, ఎదిరించే వారిని, హక్కులను అడిగే వారిపై నిర్బంధాలు వేస్తూ.. తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటి నుంచి బయట పడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ.. ప్రజల మధ్యే ఉంటున్న సీపీఐ(ఎం) అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా.. ప్రజల పక్షాన నిలబడాలంటే జహంగీర్‌ను పార్లమెంట్‌కు పంపించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, పగిళ్ల ఆశయ, కొండమడుగు నర్సింహ, నారి అయిలయ్య, జగదీష్, బట్టుపల్లి అనురాధ, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరపాటి రమేష్, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి పాల్గొన్నారు.