– కాంగ్రెస్ వందరోజుల పరిపాలన పార్లమెంట్ ఎన్నికలకు రెఫరెండం
– తెలంగాణకు పెట్టుబడులు తగ్గించేందుకు బీజేపీ కుట్ర
– రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం
నవతెలంగాణ-కొడంగల్
తెలంగాణకు బీజేపీ అత్యంత ప్రమాదకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వందరోజుల పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సమేతం గా సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని, మిగతా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే పదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు సంక్షేమ రాష్ట్రంగా నడిపించే బాధ్యత తమదేనన్నారు. బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు తరలించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికన విడదీయడంతో అక్కడ ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. అలాంటి పరిస్థితే తెలంగాణాలోనూ సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీజేపీకి పడే ప్రతి ఓటూ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారితీస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందని 400 సీట్లు ఏ విధంగా వస్తాయని ప్రశ్నించారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోడీ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే బీజేపీ మాత్రం నరేంద్ర మోడీ పేరుతో ఓట్లు అడుగుతుందని తెలిపారు. మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నవనీత్‌కౌర్ 15 సెకండ్ల కామెంట్స్‌పైనా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ఎలా ఇచ్చామో పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. కేసీఆర్‌పై తనకు సానుభూతి ఉందని, మానసిక ఒత్తిడి, నిరాశ, భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, శ్రీరాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, టీపీసీసీ ప్రతినిధి ఎండీ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.