హిందూ సాహిత్యంలో బీజేపీ అనుసరిస్తున్న

BJP is following in Hindu literature– హిందూ ఎక్కడా లేదు
– పారిస్‌లో విద్యావేత్తలు,
– విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌
పారిస్‌ : హిందూ సాహిత్యంలో బీజేపీ అనుసరిస్తున్న ‘హిందూ’ ఎక్కడా లేదని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే బీజేపీ విధానమని అన్నారు. శనివారం పారిస్‌లో విద్యావేత్తలు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘భారతదేశ యొక్క ఆత్మ’ కోసం పోరాడటానికి ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయని, దేశం ‘ప్రస్తుత అల్లకల్లోలం’ నుంచి సమర్థవంతంగా బయటపడుతుందని’ రాహుల్‌ తెలిపారు. ‘నేను గీత చదివాను, ఎన్నో ఉపనిషత్తులు చదివాను, ఎన్నో హిందూ పుస్తకాలు చదివాను కానీ.. బీజేపీ చెబుతున్న ‘హిందూ’ వాటిల్లో లేదు’ అని అన్నారు. ‘మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని, హాని చేయాలని నేను హిందూ పుస్తకాల్లో ఎక్కడా చదవలేదు, ఏ హిందూ పండితుడి వద్ద వినలేదు. కాబట్టి బీజేపీ చేస్తున్నది హిందూ కాదు. వారు హిందూ జాతీయవాదులు కాదు. వారికి హిందూ మతంతో సంబంధం లేదు. వారు ఎంతటి మూల్యానికైనా అధికారాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారం కోసం వారు ఏదైనా చేస్తారు’ అని అన్నారు.గత ఎన్నికల్లో దేశంలోని ఓటర్లల్లో 60 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు ఓటేయగా, కేవలం 40 శాతం మంది అధికార పార్టీకి ఓటు వేశారని రాహుల్‌ గుర్తు చేశారు. ‘కాబట్టి మెజారిటీ కమ్యూనిటీ బీజేపీకి ఓటు వేస్తోందనేది తప్పుడు ఆలోచన’ అని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులతో సంభాషించారు. పారిస్‌ పర్యటనకు ముందు బ్రస్సెల్స్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.