– మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్
– రాజ్యాంగాన్ని మారుస్తామన్న పార్టీలకు ఓటు వేయొద్దు : ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ-బోడుప్పల్
”రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బీజేపీని భూస్థాపితం చేస్తాం.. అలాంటి రాజకీయ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి” అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రొ.కోదండరామ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్‌లోని బొమ్మక్ బాలయ్య గార్డెన్స్‌లో ”రాజ్యాంగ రక్షణ సదస్సు” నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తాను పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరలేదని, రాజ్యాంగానికి రక్షణ కల్పించడం కోసం మాత్రమే చేరానని తెలిపారు. దేశానికి రాజ్యాంగమే రక్ష అని చెప్పారు. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంటుందని, అందుకోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 1000 మందితో రాజ్యాంగ రక్షణ యాత్ర చేపడతామని అన్నారు. మాల మహానాడు సంఘం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినది కాదని, మందకృష్ణ మాదిగతో తనకు సత్సంబంధం ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద టెంట్‌హౌస్‌లు పెడతామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యలు సరికావన్నారు. దేశంలో తనకు ఇష్టమైన ఒక మహిళ సోనియా గాంధీ అన్నారు. రేవంత్ రెడ్డి తనను ఒక కుటుంబ సభ్యునిగా పరిగణిస్తారని.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా సరైన నాయకుడు రేవంత్ రెడ్డి అని తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఊచకోత నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మహిళా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు.
దేశంలో అణచివేయబడిన సమాజం ఏదైనా ఉంది అంటే అది ఓబీసీ వర్గం మాత్రమేనన్నారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు. మాల మహానాడును విస్తృత రాజ్యాంగ పరిరక్షణ సమితిగా తయారు చేయాలని తన ఉద్దేశం అన్నారు. కంటోన్మెంట్ టిక్కెట్టు రానందున దయాకర్ అలిగాడని మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని.. కానీ తాను సినిమా రంగం కోసం చెన్నై, మద్రాస్ తిరుగుతున్నానని చెప్పారు. తన సినిమా, తన జీవితం.. తన ఉద్యమంలో అన్నీ బడుగు బలహీనవర్గాల కోసమేనన్నారు. ప్రపంచం మొత్తం ఒక మేధావి రాజ్యాంగాన్ని రచించాడు అంటుంటే.. మన భారతదేశం మాత్రం ఒక దళితుడు రాజ్యాంగాన్ని రచించాడు అనడం దౌర్భాగ్యం అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న పార్టీలకు ఓటు వేయొద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కార్యక్రమంలోకాంగ్రెస్ మేడ్చల్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు మన్నె బాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, బైరు రమేష్, ఆంధ్రమాల మహానాడు అధ్యక్షుడు కొండబాబు తదితరులు పాల్గొన్నారు.