పార్లమెంటు ప్రమాణాలపై బీజేపీ వేటు

BJP is not on Parliament's standardsపార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయన మంత్రులు, బీజేపీ నేతల అసహనం అడుగడుగునా తాండవించడం ఆశ్చర్యం కలిగించలేదు. మూడు ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ ఆధిక్యత కోల్పోయి, ఎన్డీయేలోని ఇతర భాగస్వాములపై ఆధారపడాల్సి రావడం భరించలేనిదిగా వున్నట్టు స్పష్టమైంది. గత రెండు పర్యాయాలకు భిన్నంగా ఈసారి కాంగ్రెస్‌ బలం పెంచుకుని అధికారిక ప్రతిపక్షంగా ఆవిర్భవించడం, రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత హోదా పొందడం మరింత దుర్భరంగా తయారైంది బీజేపీకి.ఆయన కూడా ఇందుకు తగినట్టే నిశిత విమర్శలు, విసుర్లతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. హిందూత్వ రాజకీయాలపై తొలిసారి లోతైన చర్చకు దారితీసిన తీరు గతంలో ఈ శీర్షికలో చెప్పుకున్నాం. అయితే రాజకీయ ప్రమాణాలతో రాజ్యాంగ నిబంధనలతో నిమిత్తం లేని ఉక్రోశంతో రెచ్చిపోయిన బీజేపీ సభ్యులు, మంత్రులు ప్రతిపక్షాలపై, రాహుల్‌గాంధీపై రాష్ట్ర ప్రభుత్వాలపై ఇష్టానుసారం దాడి చేశారు. ఈ దాడి అనేక సందర్భాల్లో వికృతంగా తయారైంది. జుగుప్సగొల్పే భాష, చవకబారు ప్రయోగాలు, చులకన చేసే మాటలూ సభ గౌరవానికి మచ్చ తెచ్చేస్థాయికి చేరాయి. ఎన్డీయే భాగస్వాములలో ఒకరిద్దరు తప్ప ఇతరులు ఈ వ్యవహారంలో పాల్గొనలేదు గాని వద్దని చెప్పే ప్రయత్నం కూడా చేసింది లేదు. పైగా వీలుచిక్కితే కేంద్రాన్ని, మోడీని పొగిడే ప్రయత్నం చేశారు.ఏతావాతా లోక్‌సభ సమావేశాలు మొత్తం రసాభాసగా మారాయి. దీనికి తగినట్టే చివరిరోజుల్లో నూతన పార్లమెంటు భవనం లీకవడం, మరోరోజు నిజంగానే బురదనీరు కూడా ఆసక్తి కలిగించే పరిణామం. ఆర్భాటంగా కట్టిన నూతన భవనంలో ఇదెలా జరిగిందనే సమీక్ష లేకపోగా కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన విషాదాన్ని కూడా రాజకీయ వివాదంగా మార్చి విషంకక్కే ప్రయత్నం వెగటు పుట్టించింది. తన విమర్శలు తట్టుకోలేక ఈడితో దాడులు చేయించాలని పథకాలు వేస్తున్నట్టు తెలిసిందని రాహుల్‌గాంధీ చివరిరోజున వెల్లడించడంతో ఇది కక్షసాధింపు పర్వంలోకి ప్రవేశించింది.
చక్రవ్యూహం వర్సెస్‌ వక్రవ్యూహం
మోడీ పాలనలో దేశం చక్రవ్యూహం (పద్యవ్యూహం)లో చిక్కుకుందని, మధ్యతరగతి ఆశలను నిర్మలా సీతారామన్‌ వమ్ముచేశారని రాహుల్‌ సోదాహరణంగా ప్రసంగించారు. మోడీ, అమిత్‌షా, మోహన్‌ భగవత్‌, అజిత్‌దోవల్‌, అంబానీ, అదానీ ఈ ఆరుగురు మాత్రమే దేశాన్ని ఏలుతున్నారని ఆయన పేర్కొన్నారు.అంబానీ, అదానీల పేరు ప్రస్తావించడంపై స్పీకర్‌ అభ్యంతరం పెట్టగా ఎ1, ఎ2 అంటానని రాహుల్‌ చమత్కారం చేశారు! బడ్జెట్‌ ప్రక్రియ మొదలైన రోజున హల్వా చేయడం పరిపాటి. కాగా ఈ కార్యక్రమంలో దిగువకులాల వారెవరూ లేరని కూడా ఆయన ఆరోపించారు. స్పీకర్‌తో సహా అనేక అభ్యంతరాలు చెబుతున్నా, అడ్డు తగులుతున్నా రాహుల్‌ వెనక్కు తగ్గకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ చక్రవ్యూహం అనే మాట,ఆయన లేవనెత్తిన ఇతర అంశాలు ప్రజలను విస్తారంగా ఆకర్షించాయి. సరిగ్గా ఈకారణం వల్లనే అవి పాలకపక్షానికి కంటగింపుగానూ మారాయి. నిజానికి ఆయన మాట్లాడుతున్నప్పుడే ఆర్థికమంత్రి రెండు చేతులతో మొహాన్ని కప్పుకోవడం ద్వారా తన వ్యతిరేకతను, అపహా స్యాన్ని ప్రదర్శించారు.రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహాపలువురు మధ్యలో అభ్యంతరాలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నిటినీ తట్టుకుంటూనే ఆయన అనుకున్న విధంగా ప్రసంగాన్ని కొనసాగించగలిగారు. దాంతో ఆ తర్వాత తమ వంతు వచ్చినప్పుడు బీజేపీ సభ్యులు కనీస విలువలు పాటించకుండా దండయాత్ర చేశారు.రాజకీయంగా సభలో గతంలో ఎవరూ ఉపయోగించని మాటలదాడి చేశారు.
రాహుల్‌ వెనకబడిన కులాల గురించి,జనగణనకు నిరాకరించడం ద్వారా వారికి అన్యాయం చేయడం గురించి మాట్లాడారు. కేంద్రమంత్రిగా వుండి నోటి జాడ్యంతో ఈసారి మాజీగా మిగిలిన అనురాగ్‌ఠాకూర్‌ అధినేత మెప్పుకోసం దీన్ని దాడికి లక్ష్యంగా చేసుకున్నారు.ఆ క్రమంలో తనను తానే మర్చిపోయి ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. ‘రాహుల్‌ గాంధీలు ప్రమాదవశాత్తూ హిందువులయ్యారు. ఆయనకు మహాభారతం గురించి ఎంత మాత్రం అవగాహన లేదు. అభిమన్యుడిని భారతంలో ఏడుగురు మహారథులు చంపేశారు.అమెరికా అంకుల్‌ శామ్‌, అంకుల్‌ సొరేస్‌ వంటివారి ప్రభావంతో ఆయన ప్రసంగాలు అలా తయారై వుండొచ్చు.తమ పార్టీ చిహ్నమైన కమలాన్ని, పద్మాన్ని చక్రవ్యూహంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. కానీ పద్మాన్ని అవమానించడ మంటే శివున్ని బుద్ధున్ని తిలక్‌ను అవమానించడమే’ అంటూ తిట్టిపోశారు. ‘అసలు తన జాతి ఏమిటో తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నారు’ అంటూ ‘రాహుల్‌గాంధీ కులమేంటని’ బాహాటంగా ప్రశ్నించారు. తన కులమే తెలియని వారు హిందువులా అంటూ ఆక్షేపించారు. రాహుల్‌ తాత ఫిరోజ్‌గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ, తల్లి సోనియాల నేపథ్యాలనూ ప్రశ్నించారు. దీంతో సభలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘మీరు కులం పేరుతో నన్ను అవమానించవచ్చు. కానీ నేను కిందివర్గాల కోసం పోరాడుతూనే వుంటానని’ రాహుల్‌ బదులిచ్చారు. అయినా తర్వాత ఇతరు బీజేపీ నేతలు కూడా అనురాగ్‌ఠాకూర్‌కు వంతపాడారు.సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ మీరు కులం లెక్కలు అడుగుతున్నారు. మిమ్మల్ని సభలో అడిగితే తప్పు బయట ఎవరిని అడిగినా తప్పు కాదా? అని వితండ వాదన లేవనెత్తారు. సంబిత్‌ పాత్ర ప్రసంగం మొత్తం కులం పైనే సాగింది.ఇక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌రిజిజు కూడా ఇదే వాదన చేస్తూ కులగణన చేయాలనేవారిని కులం అడిగితే తప్పు ఏముందన్నారు. కాంగ్రెస్‌ కులం పేరుతో దేశాన్ని విభజించాలని కుట్ర పన్నుతున్నదనీ, అఖిలేష్‌యాదవ్‌ కూడా వత్తాసునిచ్చారని ఆరోపించారు.వీధుల్లోంచి పార్లమెంటులోకి హింసను తీసుకొచ్చే పథకం పన్నారన్నారు,(సభ బయట కూడా యూపీ ఎమ్మెల్యే నందకిశోర్‌ గుజ్జార్‌ మాట్లాడుతూ ఫిరోజ్‌ ఖాన్‌ మనవడి కులం ఏమవుతుందని ఎదురు ప్రశ్న వేశారు).ఇదే కోవలో ఇంకా చాలామంది మంత్రులు, ఎంపీలు సభలోనూ, బయట వ్యాఖ్యలలోనూ కూడా కులాల గురించి మాట్లాడితే తప్పేంటని ఎదురు దాడిచేశారు, గాంధీ కుటుంబంలో వారి పేర్లు బంధుత్వాలు తీసుకొచ్చి వారికి జాతి లేదని అపహాస్యం చేశారు. ఇక్కడ సమస్య ఒక కుటుంబం గురించో వ్యక్తి గురించో కాదు. మత రాజకీయాలతో దేశంలో అసహన వాతావరణం సృష్టించిన పాలక పార్టీ కులగణనను వ్యతిరేకించడం కోసం కులం రచ్చ చేయడమే ఇక్కడ విపరీతం.
మోడీ వత్తాసు, కంగనా పైత్యం
దీనిపై మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ తీవ్ర నిరసన విమర్శలు వచ్చాక కూడా కండ్లు తెరవకపోగా బీజేపీ అగ్రనాయకత్వమే అనురాగ్‌ఠాకూర్‌కు అండగా నిలిచింది.స్వయంగా ప్రధాని మోడీ ఆయన ప్రసంగాన్ని ఆకాశానికెత్తారు. ప్రత్యర్థుల వాదనలను తిప్పికొట్టడం కోసం ఎలా మాట్లాడాలో తెలియాలంటే అనురాగ్‌ ప్రసంగాన్ని పూర్తిగా ఆలకించాలని ఆదేశించారు. ఇక్కడో కొసమెరుపు. సభా ప్రమాణాలకు విరుద్ధంగా వుందని అనురాగ్‌ఠాకూర్‌ ప్రసంగంలో వ్యాఖ్యలను స్పీకర్‌ ఓం బిర్లా తొలగించారు. కానీ మోడీ ‘ఎక్స్‌’లో ఆయన పూర్తి ప్రసంగాన్ని పొందుపరుస్తూ దాన్ని చదవాలని సలహా ఇచ్చారు.గతంలో వచ్చిన రూలింగ్‌లు, తీర్పుల ప్రకారం ఒకసారి సభ రికార్డుల నుంచి తొలగించిన భాగాలను ప్రచురించడం ప్రసారం చేయడం తప్పు.శిక్షార్హం, అందుకే ప్రతిపక్షాలు ప్రధానిపై సభా హక్కుల నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి గతంలోనూ స్మృతి ఇరానీ వంటివారి విషయంలో దుబారా మాటలను అడ్డుకోకపోగా మరింత రెచ్చగొట్టడం చూశాం, ఆ కోవకే చెందిన నటి, నూతన సభ్యురాలు కంగనా రనౌత్‌ మరో అడుగుముందుకేసి రాహుల్‌పై వ్యక్తిగత దాడికి దిగారు.ఆయన మానసిక స్థితి సరిగ్గా వుండదని, ఏం మాట్లాడతారో తనకే తెలియదని తిట్టిపోశారు. ‘ఎప్పుడూ తాగినట్టు వుంటారు. మాదకద్రవ్యాలు(డ్రగ్స్‌) తీసుకుంటారనుకుంటా, తనకు డ్రగ్స్‌ పరీక్ష చేయించాలి’ అంటూ ఇష్టానుసారం ట్వీట్‌ చేశారు.
కేరళపై దాడి
రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాల మీద కూడా ఇదే విధంగా దిగజారి మాట్లాడటంలో బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. కేరళలోని వైనాడ్‌లో భయంకర స్థాయిలో కొండచరియలు విరిగిపడి మూడు వందల మంది దాకా మరణిస్తే బీజేపీ సర్కారు నెంబర్‌2 హోంమంత్రి అమిత్‌షాకు అక్కడ రాజకీయమే ముఖ్యమైంది. కొద్దిమాటలు సంతాపంతో మాట్లాడి ఆ వెంటనే పినరయి విజయన్‌ ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు.కేంద్రం ముందస్తు అనేక హెచ్చరికలు పంపినా రాష్ట్రం స్పందించలేదని నిందవేశారు. తాము ప్రకృతి ఉత్పాతాల రక్షణ దళాలను పంపించామన్నారు.వీటిని ఎంత నమ్మకంగా చెప్పారంటే విన్నవారికి కేరళ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని సందేహం వస్తుంది. కానీ అవతలివైపున మాట్లాడిన ముఖ్యమంత్రి విజయన్‌ ఇవన్నీ అవాస్తవాలని సోదాహరణంగా తేల్చేశారు. సాదాసీదా హెచ్చరికలు తప్ప అసాధారణ నష్టం జరగబోతుందన్న స్థాయిలో ఒక్కటి కూడా రాలేదన్నారు. కొండచరియలు విరిగి ముప్పు వాటిల్లాకే తీవ్ర హెచ్చరిక సంకేతాలు వచ్చాయని వాటి వివరాలను కూడా పొందుపర్చారు.(ఆ వివరాలు మీడియాలో వచ్చాయి) దళాలను కూడా తమ అభ్యర్థనపై పంపారే గానీ కేంద్రం చొరవతో కాదని వెల్లడించారు.అయితే ఈ సమయంలో సహాయక చర్యలు ముఖ్యం తప్ప రాజకీయ వివాదాలు సాగించాలనుకోవడం లేదని విజయన్‌ హుందాగా ప్రకటించారు.కోవిడ్‌ సమయంలో కేరళ ఆదర్శంగా స్పందించందని మోడీతో సహా దేశమంతా అభినందించడం ఇక్కడ గుర్తుకు వస్తుంది. ఈ కాలంలో పరిస్థితి ఎలా మారిందో ఈ ఒక్క ఉదాహరణతో స్పష్టమవుతుంది.
హక్కుల తీర్మానాలు
పార్లమెంటు నూతన భవనం లీకేజీ ఘటనలో ఇందుకు పూర్తి భిన్నంగా కేంద్రం వ్యవహరించడం ఆసక్తికరం. న్యూవీస్తా పేరిట హడావుడిగా ఏకపక్షంగా నూతన పార్లమెంటు భవనాలు నిర్మించి మోడీనే వ్యక్తిగతంగా ప్రారంభించడం, రాష్ట్రపతిని కూడా ఆహ్వానించక పోవడం తీవ్ర విమర్శకు కారణమైంది. ఇంతలోనే ఆ భవనాలు లీకేజీ కావడం ఎవరైనా ఊహించగలరా? అదేం సమస్య కానట్టు డోమ్‌ గ్లాసులు అతుకుపెట్టడానికి వాడిన పదార్థంవల్ల లీకేజి జరిగిందని సరిపెడుతున్నారు. ఏదైనా ముందుగా పసిగట్టలేదు కదా? తగు జాగ్రత్తలు తీసుకోలేదు కదా? దీన్ని సమర్థించుకోలేక సతమతమవుతుండగానే పార్లమెంటు ప్రాంగణంలోకి వర్షపునీరు భారీ ఎత్తున పారడం మొదలెట్టింది. కేరళ చాలా చిన్న రాష్ట్రం. జనసాంద్రత అత్యధికం. భిన్న ప్రకృతి నేపథ్యాలు పర్యావరణ పరిస్థితులు.పేదరికం.అలాంటి చోట అనూహ్యమైన స్థాయిలో వర్షం కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడితే రాష్ట్ర ప్రభుత్వ మహాపరాధమట.
దేశ రాజధానిలో పూర్తిగా తమ కనుసన్నల్లో నిన్న,మొన్నకట్టిన పార్లమెంటు సౌధంలో నీళ్లు పారితే బాధ్యత లేదట. ద్వంద్వ ప్రమాణాలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? బాధిత రాష్ట్రాన్ని ఆదుకునే బదులు మరో రెండు బండలు వేసే మోడీత్వ వ్యూహాలను ఏమంటాం? లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఇదే విధమైన విడ్డూరాలు చాలా జరిగాయి. స్వయంగా చైర్మన్‌గా దాన్ని నిర్వహించే ఉప రాష్ట్రపతి జగదీష్‌ దన్‌కర్‌ ఆరెస్సెస్‌ దేశభక్తి కీర్తనలు ఆలపించడం, అయినదానికి కాని దానికి ప్రతిపక్షాలపై దాడి చేయడం అందులో భాగమే. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కేరళ ప్రమాదంపై సభను తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినందుకు వామపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు హక్కుల నోటీసు ఇచ్చారు. ఎల్‌ 1 మోడీకి ఎల్‌2 అమిత్‌షాకు కూడా హక్కుల నోటీసు ఇవ్వవలసిన పరిస్థితి గమనిస్తే పార్లమెంటు తీరు ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది. తెలుగు ఎంపీలు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోకుండా ప్రాంతీయ పార్టీలుగా తమ వివాదాల్లోనే మునిగితేలడం కొసమెరుపు.

– తెలకపల్లి రవి