బీజేపీకి అభ్యర్థులు కరువు

– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అసంతృప్తుల కోసం ఎదురుచూపు
– ఉన్నవారిలో గ్రూప్‌ వార్‌
– భువనగిరిలో జిట్టా ఉండేనా.. పోయేనా..
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉనికి కోసం వెతుకులాట
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ముసలం మొదలైంది. గ్రూప్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. పార్టీలో ఉన్న ఒకరిద్దరు లీడర్ల మధ్య కూడా టికెట్‌ కోసం పోటీ పెరగడం.. కొత్త నేతల చేరికతో పాత క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది. దాంతో బీజేపీకి ఉమ్మడి జిల్లాలోని ఒకట్రెండు నియోజకవర్గాలపై ఉన్న కొద్దిపాటి పట్టు కూడా సన్నగిల్లుతోంది. దీనికితోడు పార్టీ కార్యక్రమాలు మినహా ఏ ప్రజాసమస్యలపైనా పనిచేయకపోవడం, క్షేత్రస్థాయి క్యాడర్‌కు లీడర్లు అందుబాటులో ఉండకపోవడం.. తదితర అంశాల వల్ల గ్రామీణ స్థాయిలో ఆ పార్టీకి ఆదరణ కరువైంది. దాంతో రాష్ట్ర నాయకత్వానికి సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదనే చర్చ నడుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో బీజేపీ పరిస్థితి ఇదీ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ పరిస్థితి గతం కంటే దారుణంగా తయారయ్యిందనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొద్దోగొప్పో చెప్పుకోదగ్గ లీడర్లు కన్పించారు. ఈసారి అభ్యర్థులను వెతుక్కోవడం గగనంగా మారింది. భువనగిరి, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో గ్రూప్‌ వార్‌ నడుస్తోంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఓవైపు గూడూరు నారాయణరెడ్డి.. మరోవైపు జిట్టా బాలకృష్ణారెడ్డిల పేర్లు వినిప ిస్తుండగా, ఇద్దరు నేతల మధ్య సఖ్యత కొరవడింది. దాంతో నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్‌లో ఆయో మయం నెలకొంది. దీనికితోడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడంతో అక్కడ కాంగ్రెస్‌కు బలమైన క్యాండెట్‌ అవసరం పడింది. దాంతో జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీకి బై.. బై.. చెప్పి చెయ్యి అందుకోవాలని ఆరాట పడుతున్నారనే ప్రచారమూ సాగుతోంది.
నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం వెతుకులాట..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో బీజేపీ ప్రభావం ఎంతోకొంత ఉన్నవి రెండు మూడు నియోజక వర్గాలకు మించిలేవు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, నల్లగొండలో మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, కన్మంతరెడ్డి శ్రీదేవి, నాగం వర్షిత్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నికలో పోటీకి దిగిన రవినాయక్‌, కంకణాల నివేదితారెడ్డి, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరావుల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఇందులో చివరకు ఎంతమంది ఉంటారనేది ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనైతే బీజేపీకి చెప్పుకోదగిన లీడర్లు లేరని సొంత పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. ఇదే తరహాలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో రవి నాయక్‌ కనీసం గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోకపోవడం.. మునుగోడు ఉప ఎన్నికలో రెండో స్థానంలో నిలిచినా.. అది రాజగోపాల్‌రెడ్డికి వ్యక్తిగతంగా పడిన ఓట్లేననే ప్రచారం ఉంది. మిర్యాలగూడ, నకిరేకల్‌, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని సమాచారం. అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో టికెట్‌ దక్కని ఆశావాహులు బీజేపీ వైపు చూస్తారని, వారిని పోటీలోకి దింపేందుకు చివరి నిమిషం వరకు వెయిట్‌ చేయాలనే ధోరణితో ఉన్నట్టు ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఏదీఏమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ మనుగడ కష్టమైన పనే..
నల్లగొండ, మునుగోడు అసెంబ్లీల్లో..
నల్లగొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, కన్మంతరెడ్డి శ్రీదేవి, నాగం వర్షిత్‌రెడ్డిల మధ్య గ్రూప్‌ వార్‌ జోరుగా నడుస్తోంది. టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ముమ్మరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే నల్లగొండ అసెంబ్లీ బాధ్యతలను మొదటి నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ మోస్తూ వచ్చారనే ప్రచారం ఉంది. ఇటీవల తెరపైకి వచ్చిన నాగం వర్షిత్‌ రెడ్డి పార్టీ నియమావళిని పక్కకు నెట్టి.. బీజేపీ టికెట్‌ తనదేననే ప్రచారం చేస్తుండటంపై సొంత పార్టీ నేతల నుంచి భిన్నస్వరం విన్పిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుపై పాత బీజేపీ క్యాడర్‌ అసంతృప్తితో ఉంది. దీనికితోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరతారనే ప్రచారం సైతం బీజేపీ క్యాడర్‌ను సందిగ్ధంలో పడేస్తోంది.