– నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం
– -చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ప్రతి సవాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత పేద ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పైసలు సంపాదించాలన్న యావతో మాత్రం కాదని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా అర్థరహితమని… ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని గురువారం మీడియాతో వ్యాఖ్యానించారు. మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. చేవెళ్ళకి వచ్చిన మహేశ్వర్ రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చెబుతూ ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం దారుణమని అన్నారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. సీతారాంపూర్ భూముల వ్యవహారంలో తన పాత్ర అసలు ఏమీ లేదనీ చెప్పుకొచ్చారు. అసలు ఆ వ్యవహారం తాను ఎంపీ కాకముందే జరిగిందన్న విషయం మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలని కోరారు. తాను అసైన్డ్ భూములు తీసుకున్నట్టు ఒక్క ఉదంతమైనా రుజువు చేయగలరా? అని ప్రశ్నించారు. ఇక తనని కేటీఆర్ బినామీ అంటూ ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. అ విధంగా తనకు ఒక్క ఇంచ్ భూమి ఉందని నిరూపించినా తాను దేనికైనా సిద్ధమని రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు.