మందికి పుట్టిన బిడ్డను మాకే పుట్టిన బిడ్డని ముద్దాడే వారు బిజెపి నాయకులు

నవతెలంగాణ – సిద్దిపేట
నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు అనుమతులు ఇచ్చిన మెడికల్ కళాశాలలను కూడా తామే మంజూరు చేయించామని బీజేపీ నాయకులు చెప్పడం మందికి పుట్టిన బిడ్డను మాకే పుట్టిన బిడ్డని ముద్దాడే విధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన సంక్షేమ దినోత్సవంలో భాగంగా నిరుపేద బీసీ కుల వృత్తుల వారికి వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెడికల్ కళాశాల నిర్మిస్తే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రభుత్వ, ప్రవేట్ మెడికల్ కళాశాలలను పరిశీలించి అనుమతులు ఇచ్చారని, కానీ బండి సంజయ్ తామే తీసుకొచ్చామని చెప్పడం తగదని, తలదించుకొని క్షమాపణ చెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. కేంద్రం అనుమతితో వచ్చిన ఎయిమ్స్ కళాశాలలో ఆపరేషన్ థియేటర్ లేదని, వసతులు లేక అక్కడి విద్యార్థులు, రోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దమ్ముంటే , తెలంగాణ మీద ప్రేమ ఉంటే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని , బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, వెనకబడిన జిల్లాలకు ఇవ్వవలసిన రూ 1350 కోట్ల పెండింగ్ నిధులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో ప్రజలకు మంచినీరు 10 రోజులకు ఒకసారి కూడా అందడం లేదని , తెలంగాణలోని ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రతిరోజు అందిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగం అని అన్నారు. ఆసరా పింఛన్తో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆత్మగౌరవం పెంచారనీ, తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్ళు ఏమి వచ్చిందో ఆసరా పింఛన్ పొందుతున్న వృద్ధులను అడిగి తెలుసుకోవాలనీ అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు కానీ, ఏ ఒక రాష్ట్రంలో కూడా తెలంగాణలో లాగా బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదనీ,  రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో 200 రూపాయలతో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వగా నేడు 2016 రూపాయలతో 44 లక్షల మందికి ఇస్తున్నామనీ అన్నారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రలో 600 రూపాయలు, కర్ణాటకలో 500 రూపాయలకు మించి ఇవ్వడం లేదనీ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు పంచుతున్నారనీ అన్నారు. ఇప్పటివరకు చాలామంది సీఎంలను చూశాము కానీ కెసిఆర్ లాగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి పైసలు ఇచ్చిన సీఎంలను చూడలేదనీ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 11వేల 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 12 లక్షల 71 వేల ఆడపిల్లల పెళ్ళికి ఆర్థిక సాయం చేశారనీ అన్నారు. తెలంగాణ రాకముందు అప్పటి ప్రభుత్వం పింఛన్ల కోసం 5558 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా , తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 59 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనీ, గరీబోళ్ల పెళ్లిళ్ల ఫంక్షన్ హాల్స్ అద్దె ఖర్చు తగ్గించేందుకు ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడం మూలంగా ప్రైవేట్ ఆస్పత్రులు మూలకుపడే పరిస్థితులు సిద్దిపేటలో నెలకొన్నాయనీ,  ఒకప్పుడు 70 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రిలో 30 శాతం ప్రసవాలు గవర్నమెంట్ ఆసుపత్రిలో జరగగా ఇప్పుడు మొత్తం ఉల్టా గా 70 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయనీ అన్నారు. ఈనెల 14వ నుండి బిడ్డ కడుపున పడగానే గర్భిణీ స్త్రీలకు అందించే న్యూట్రిషన్ కిట్టు కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించబోతున్నామని అన్నారు. సగౌరవంగా అంతిమ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైకుంఠధామాలను నిర్మించామని,  అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి సందర్భంలో ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందనీ అన్నారు.  పిల్లల చదువుల కోసం సిద్దిపేట జిల్లాలో 12, రాష్ట్రవ్యాప్తంగా 1002 వివిధ గురుకులాలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామనీ తెలిపారు. ఒక విద్యార్థి పై లక్ష రూపాయల వ్యయం చేస్తున్నామనీ,  రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారనీ తెలిపారు.  అప్పుడు డయాలసిస్ పేషంట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 మాత్రమే ఉండగా, తెలంగాణ సాధించిన తర్వాత 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3 కాలేజీల నుండి తొమ్మిది సంవత్సరాల 21 మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేసుకున్నామనీ అన్నారు. కోమటి చెరువులో నెలాఖరులోగా డైనోసార్ పార్క్ ను ప్రారంభించకపోతున్నామని, చెత్తను మూడు రకాలుగా వేరుగా సేకరించిన మూలంగా సిద్దిపేట పట్టణంలో ఈగలు, దోమలు, పందులు లేకుండా చేసినమని, స్వచ్ఛ సిద్దిపేట సహకరించిన అక్కా, చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 60 మంది బీసీలకు ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ, 30 వేలు మరియు 50 వేల చొప్పున 27 మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం, 20 లక్షల రూపాయల విలువైన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇద్దరికీ, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎనిమిది మందికి మ్యారేజ్, యాక్సిడెంట్ బెనిఫిట్స్,  సెట్విన్ ద్వారా 40 మందికి కుట్టు మిషన్లు, కులాంతర వివాహం చేసుకున్న మూడు జంటలకు కళ్యాణ లక్ష్మితో కలిపి 2 లక్షలు 50 వేల రూపాయల సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్ 5 రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, రాష్ట్ర మెడికల్ బోర్డు మెంబర్ పాల సాయిరాం, మునిసిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.