రేషన్‌ డీలర్ల సమావేశాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు

– రేషన్‌ డీలర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు
– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్‌ యాదవ్‌
నవ తెలంగాణ-నర్సాపూర్‌
నర్సాపూర్‌ పట్టణ సమీపంలోని చాముండేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం నర్సాపూర్‌ నియోజకవర్గ రేషన్‌ డీలర్ల సమావేశం నిర్వహించగా ఈ సమావేశాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సమావేశం ఎలా నిర్వహిస్తారని రేషన్‌ డీలర్లపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్‌ యాదవ్‌తో పాటు నాయకులు మండిపడ్డారు. నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకే రేషన్‌ డీలర్లు ఈ సమావేశం నిర్వహించుకున్నారన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు తెలిపాలని ఈ సమావేశం నిర్వహించి రేషన్‌ డీలర్లకు డబ్బులు పంచారని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై రేషన్‌ డీలర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్‌, ఎరుకల యాదగిరి, లతా రమేష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.