– అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్ … కాంగ్రెస్ మ్యానిఫెస్టో బీఆర్‌ఎస్‌ను భయపెడుతుంది
– నక్సలైట్ల ఎజెండా అమలు చేసింది కాంగ్రెస్సే
– ఆ తర్వాతే నక్సలిజం తగ్గింది
– ‘మీట్ ది ప్రెస్’లో రేవంత్ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల్లో బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్లు రావు. రాష్ట్రానికి బీసీ సీఎంను ఎలా చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని గుర్తు చేశారు. బీసీ గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా…ఆ పార్టీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. బీసీగణన చేయలేని పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుందని నిలదీశారు. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నాయన్నారు.
ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహమని విమర్శించారు. ఎన్నికల కోసమే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుందని చెప్పారు.ఎస్సీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు… ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా… బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా చీల్చేందుకే కమిటీతో కాలయాపన అని ఆరోపించారు. దమ్ముంటే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మోడీని కలిసిందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. నక్సలైట్ల ఎజెండాను కాంగ్రెస్ అమలు చేసిందనీ, ఆ తర్వాతనే నక్సలిజం తగ్గిందని గుర్తు చేశారు. పేదలకు భూమి పంచింది కాంగ్రెస్ పార్టీయేన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని విమర్శించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తుందన్నారు.కాస్రా పహాణీ లాంటి మాన్యువల్ రికార్డులను యథాతథంగా భూమాత ద్వారా డిజిటలైజ్ చేస్తామన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. భూ యజామానికి, కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఆర్థికసాయమందిస్తామన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణం అనే చర్చే లేదు
రాష్ట్రంలో సంకీర్ణం అనే చర్చే లేదని రేవంత్ అన్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదన్నారు. కాంగ్రెస్‌పార్టీకి 80-85 సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కారు పార్టీని భయపెడుతున్నదని చెప్పారు. అధికారం కోల్పోతు న్నామన్న విచక్షణ కోల్పోయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనప్పుడు సీమాంధ్ర పాలకులు మాట్లాడినట్టు ఇవాళ కల్వకుట్ల కుటుంబం మాట్లాడు తున్నదని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హమీనిచ్చారు.
కేసీఆర్ ఉద్యమకారుడు కాదు
సీఎం కేసీఆర్ ఉద్యమకారుడు కాదనీ, ఫక్తు రాజకీయ నాయకుడని, ఆయనకు రావాల్సినదానికంటే ఎక్కువే వచ్చాయని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు. స్వాతంత్య్ర సమరయో ధులతో సమానంగా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామన్నారు.
అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమని చెప్పారు. ప్రగతిభవన్‌ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్‌గా మారుస్తామని తెలిపారు. సీఎంకు ఫెడరల్ స్ఫూర్తి తెలియదనీ, ఆయన రాచరికమే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇస్తున్న విద్యుత్ కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్ నుంచి కాదా? అని ప్రశ్నించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్.. కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌రెడ్డి, సాధిక్, కె శ్రీనివాసరావు, మధు తదితరులు ఉన్నారు.