– ఎఐకెఎస్ విమర్శ
న్యూఢిల్లీ : దేశ రైతాంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ప్రస్తావించడంలో బీజేపీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టో విఫలమైందని ఎఐకెఎస్ విమర్శించింది. దేశంలోని యావత్తు రైతులు, వ్యవసాయ కార్మికులను బిజెపి మేనిఫెస్టో ప్రత్యక్షంగా అవమానించిందని ఎఐకెఎస్ పేర్కొంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అమలు, పంట సేకరణ, రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ వంటి కీలకమైన అంశాలను మేనిఫెస్టో 2024లో ప్రస్తావించలేదని పేర్కొంది. నిజానికి 2014, 2019 మేనిఫెస్టోల్లో చేసిన పాత వాగ్దానాలనే తాజా మేనిఫెస్టోలో బిజెపి చేసిందని, అంటే పాత హామీలను అమలు చేయలేదని బీజేపీ స్పష్టంగా అంగీకరించినట్లుయిందని ఎఐకెఎస్ తెలిపింది. దేశంలో తీవ్రంగా ఉన్న వ్యవసాయ సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేసిందని ఎఐకెఎస్ ఎద్దేవా చేసింది.
ఎప్పటికప్పుడు ఎంఎస్‌పిని పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వ్యవసాయ వ్యయాలను బిజెపి పరిగణనలోకి తీసుకోలేదని ఎఐకెఎస్ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకూ 1,00,474 మంది అన్నదాతలు, 3,12,214 మంది రోజువారీ వేతన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినా వీరి కుటుంబాలకు 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎలాంటి రుణ మాఫీ కానీ, ఆర్థిక సాయం కానీ చేయలేదని ఎఐకెఎస్ విమర్శించింది. అయితే 2014-15 నుంచి 2022-23 వరకూ కార్పొరేట్ సంస్థలకు రూ. 14.55 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎఐకెఎస్ గుర్తు చేసింది. 2024 బిజెపి మేనిఫెస్టోను దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులకు బహిరంగ సవాలుగా ఎఐకెఎస్ అభివర్ణించింది. వ్యవసాయ సమస్యల నుంచి తప్పించుకున్న బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఓటర్లకు ఎఐకెఎస్ విజ్ఞప్తి చేసింది.