నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఎస్‌పీ ఎంపీ దానీష్ అలీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ లోక్‌సభ హక్కుల కమిటీ ముందు గైర్హాజరయ్యారు. మంగళ వారం లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్నానని, ”మంగళవారం తాను అందుబాటులో ఉండటం లేదంటూ బీజేపీ నేత బిధూడీ పార్లమెంటరీ కమిటీకి లేఖ రాశారు. దానీష్ అలీపై వ్యాఖ్యలకు సంబంధించి తమ ముందు హాజరుకావాలంటూ హక్కుల కమిటీ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో విచారణకు తదుపరి తేదీని పార్లమెంటు కమిటీ నిర్ణయిస్తుంది” అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇటీవల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సౌత్ ఢిల్లీ ఎంపీగా ఉన్న బిధూడీ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన దానీష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది ఉంటూ మండిపడ్డారు. ఎంపీ అలీపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో సభలో అలజడి చెలరేగింది. కొత్త పార్లమెంటు సాక్షిగా తనను అవమానించారని దానీష్ అలీ ఆవేదన వ్యక్తం చేయగా, బిధూడీని స్పీకర్ ఓం బిర్లా మందలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీపై చర్యలు తీసుకోవాలని దానీష్ అలీ లేఖ రాయడం, పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరడంతో లోక్‌సభ హక్కుల కమిటీ మందుకు ఈ వ్యవహారం చేరింది. బిధూడీ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చింది.