బీజేపీ ఎంపీ బిధూరిని సస్పెండ్‌ చేయాలి!

BJP MP Bidhurini Should be suspended!– వివాదాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించాలి
– స్పీకర్‌పై ప్రతిపక్షాల ఒత్తిడి
– నాలుగు పార్టీల నేతల లేఖలు
న్యూఢిల్లీ : బీఎస్‌పీ ఎంపీ దనీష్‌ అలీపై గురువారం రాత్రి లోక్‌సభ వేదికగా దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరిని సస్పెండ్‌ చేయాలని ప్రతిపక్షాలు స్పీకర్‌ ఓం బిర్లాను కోరాయి. మొత్తంగా ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి ప్రస్తావించాలని నాలుగు ప్రతిపక్షాలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మొత్తం వివాదంలో అత్యంత నెమ్మదిగా ప్రతిస్పందించింది బీజేపీ అధ్యక్షురాలు మాయావతినే. బిధూరిపై బీజేపీ సముచితమైన చర్య తీసుకోకపోవడం విచారకరమని మాయావతి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సభా హక్కుల కమిటీ తన దర్యాప్తును పూర్తి చేసేవరకూ ఎంపీ బిధూరిని సస్పెండ్‌ చేయాలని కోరుతూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అదిర్‌ రంజన్‌ చౌదరి, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ నేత సుప్రియా శూలె, టీఎంసీ నేత అపురూప పొద్దార్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇండియా ఫోరమ్‌లోని ఇతర సభ్య పార్టీల నుండి కూడా మరిన్ని లేఖలు రానున్నట్లు సమాచారం. ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన సభ్యునిపై పార్లమెంట్‌ చరిత్రలోనే ఎన్నడూ ఇలాంటి మాటలు ఉపయోగించలేదని అదిర్‌ రంజన్‌ చౌదరి తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చేసినందున వీటిని రికార్డుల నుంచి తొలగించినా పెద్ద ప్రభావమేమీ వుండదన్నారు. శుక్రవారం ఉదయం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో… నవ్వుకుంటూ కనిపించిన ఇద్దరు మాజీ క్యాబినెట్‌ మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, హర్ష వర్ధన్‌ వైఖరి పట్ల కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. బిధూరితో సహా వారి వైఖరిని కూడా ఖండించాల్సి వుందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ పోస్ట్‌ చేశారు.
”బీజేపీ ఎంపీ బిధూరి ప్రసంగం సాగుతున్నపుడు సభలో గందరగోళంగా వుంది. బిధూరి ఏం అంటున్నారో చూడండి అంటూ దనీష్‌ అలీ నన్ను అప్రమత్తం చేసిన వెంటనే నేను ఆ అన్‌పార్లమెంటరీ మాటలను రికార్డుల నుంచి తొలగించాలంటూ రూలింగ్‌ ఇచ్చాను, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా బిధూరి తరపున క్షమాపణ చెప్పారు, కానీ బిధూరిని సస్పెండ్‌ చేసే అధికారం నా చేతుల్లో లేదు” అని వాగ్వాదం జరిగిన సమయంలో సభాధ్యక్ష స్థానంలో వున్న కాంగ్రెస్‌ ఎంపి సురేష్‌ చెప్పారు. ఇలాంటి అసహ్యకరమైన భాషను బిధూరి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు.
ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా విలేకర్లతో మాట్లాడుతూ, ఈ సంఘటనను తనను విస్మయపరచలేదని, కానీ విచారపడ్డానని తెలిపారు. మైనారిటీ ఎంపీపై పార్లమెంట్‌లో ఇటువంటి మాటలు ఉపయోగించడమంటే ముస్లింలు, దళితులపై దూషణలకు దిగే వారసత్వాన్ని మనం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏఔఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ, ఇదేమీ ఆశ్చర్యపోవాల్సిన అంశం కాదు, రోజు రోజుకు బీజేపీ దిగజారుతోందని వ్యాఖ్యానించారు. బిదూరీపై చర్య తీసుకోకపోగా భవిష్యత్తులో ఆయనను మరింత అదృష్టం (ఉన్నత పదవులు) వరించే అవకాశం వుందని పేర్కొన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, బిధూరి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. బడా భవనాల వెనుక బీజేపీ తన మతోన్మాదాన్ని కప్పిపుచ్చుకోలేదన్నారు.