బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ చిప్‌ ఖరాబైంది

BJP MP Laxman's chip is damaged– రిపేర్‌ చేయించుకుంటే మంచిది…
– మాతో టచ్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి 20 మంది, బీజేపీ ఐదుగురు ఎమ్మెల్యేలు : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమంటూ బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి తప్పుపట్టారు. ఆయనకు చిప్‌ ఖరాబైందనీ, వెంటనే రిపేర్‌ చేయించుకుంటే మంచిందని సూచించారు. కొత్త చిప్‌ వేసుకొని రావాలనీ, కావాలంటే దానికి అయ్యే ఖర్చునూ కూడా కాంగ్రెస్‌ పార్టీనే ఇస్తుందన్నారు. అందుకే ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారనీ, వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనీ, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు. పోలీసులు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని ప్రశంసించారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ, ఆయన పండితునిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఎలా అన్నారనీ, బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఈ కుట్రలో బీజేపీ పాత్ర ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు పడిపోతుందో లక్ష్మణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హామీలిచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులను మించిన వారు ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతీ విషయంలో ఆ పార్టీ నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రగల్భాలు పలుకుతారని విమర్శించారు. మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్‌కి తెలియదన్నారు.